భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంటు అత్యంత కీలకమైన సంస్థ. దేశానికి అవసరమైన చట్టాలను రూపొందించడం పార్లమెంటు ప్రధాన బాధ్యత. పార్లమెంటులో బిల్లులను రెండు విధాలుగా ప్రవేశపెడతారు. ఒకటి ప్రభుత్వం ప్రవేశపెట్టే గవర్నమెంట్ బిల్లు, మరొకటి మంత్రివర్గంలో లేని సభ్యులు ప్రవేశపెట్టే ప్రైవేట్ మెంబర్ బిల్లు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 107 ప్రకారం పార్లమెంట్ సభ్యుడు ఎవరైనా బిల్లును ప్రవేశపెట్టే హక్కు కలిగి ఉంటారు.
పార్లమెంటరీ చరిత్రను పరిశీలిస్తే..ప్రైవేట్ మెంబర్ బిల్లులు చట్టాలుగా మారడం చాలా అరుదు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు కేవలం 14 ప్రైవేట్ మెంబర్ బిల్లులు మాత్రమే చట్టాలుగా మారాయి. వాటిలో చివరిది 1970లో సుప్రీంకోర్టు క్రిమినల్ న్యాయ పరిధిని పెంచే బిల్లు ఆమోదం పొందింది. ఆ తర్వాత దాదాపు ఐదు దశాబ్దాలుగా వేలాది ప్రైవేట్ మెంబర్ బిల్లులు పార్లమెంటులో ప్రవేశపెట్టినా ఒక్కటి కూడా చట్టంగా మారలేదు. అంటే ప్రభుత్వ మద్దతు లేకుండా ప్రైవేట్ మెంబర్ బిల్లు చట్టంగా మారే అవకాశాలు దాదాపు లేవని చెప్పవచ్చు. ఈ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుంటే, తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు ప్రైవేట్ మెంబర్ బిల్లుతో సాధ్యమని కాంగ్రెస్ నేతలు చెప్పడం రాజకీయ ప్రకటనగా కనిపిస్తున్నది.
దేశంలో రిజర్వేషన్లపై 50% పరిమితిని సుప్రీంకోర్టు ‘ఇందిరా సహానీ కేసు’ (1992)లో విధించింది. ఈ తీర్పు ప్రకారం సాధారణ పరిస్థితుల్లో రిజర్వేషన్లు 50% మించకూడదు. అందువల్ల ఏ రాష్ట్రమైనా 50%కు మించి రిజర్వేషన్లు అమలు చేయాలంటే సాధారణ చట్టం సరిపోదు. ఈ పరిస్థితిలోనే తమిళనాడు ప్రభుత్వం 69% రిజర్వేషన్ల చట్టాన్ని రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చించడం ద్వారా న్యాయపరమైన రక్షణ పొందింది. అప్పటి నుంచి తమిళనాడులో 69% రిజర్వేషన్లు అమలులో ఉన్నాయి.
ఎన్నికల ముందు 2023 నవంబర్‌లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే చట్టబద్ధంగా అమలు చేస్తామని ప్రకటించింది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కులగణన నిర్వహించి, కమిషన్ సిఫార్సుల ఆధారంగా శాసనసభ, శాసనమండలిలో బిల్లును ఆమోదింపజేసింది. గవర్నర్ ఆమోదం తర్వాత ఆ బిల్లును 2025 ఏప్రిల్‌లో కేంద్ర ప్రభుత్వానికి పంపింది. దీనిని రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని కోరింది. ఆ ప్రతిపాదన కేంద్రం వద్ద పెండింగ్‌లోనే ఉన్నది.
కేంద్రంలో బిల్లు పెండింగ్‌లో ఉండగానే రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో జీవో నంబర్ 9 ద్వారా 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటించింది. అయితే ఇది చట్టపరంగా నిలబడదని బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరమ్ హెచ్చరించింది. తర్వాత జరిగిన పరిణామాలు కూడా అదే విషయాన్ని నిరూపించాయి. ఆ జీవోను హైకోర్టు నిలిపివేసింది. ఫలితంగా పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు 42% రిజర్వేషన్లు లేకుండానే నిర్వహించారు.
ఇటీవలి కాలంలో కొంతమంది కాంగ్రెస్ నాయకులు పార్లమెంట్లో ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టి 42% రిజర్వేషన్ల అంశాన్ని సాధిస్తామని ప్రకటిస్తున్నారు. అయితే పార్లమెంటరీ చరిత్రను చూస్తే ఇది అమలయ్యే అవకాశాలు చాలా తక్కువ. ప్రైవేట్ మెంబర్ బిల్లులు సాధారణంగా చర్చలకు మాత్రమే పరిమితమవుతాయి. కేంద్ర ప్రభుత్వం మద్దతు లేకుండా అవి చట్టాలుగా మారడం దాదాపు అసాధ్యం. ముఖ్యంగా రాజ్యాంగ సవరణ వంటి కీలక అంశాల్లో ప్రైవేట్ మెంబర్ బిల్లుకు విజయావకాశాలు మరింత తక్కువ. అందువల్ల సమస్యను హైలైట్ చేయడానికి లేదా ప్రజల దృష్టిని ఆకర్షించటానికి మాత్రమే ప్రైవేట్ మెంబర్ బిల్లు ఉపయోగపడవచ్చు, కానీ అది పార్లమెంటులో చట్టంగా మారే అవకాశాలు చాలా స్వల్పం.
బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్‌కు నిజంగా ఉంటే, తమిళనాడు తరహాలో ముందుగా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి. ఆ సమావేశంలో అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించి, సభ్యుల అనుమానాలను నివృత్తి చేసి, బీసీల రిజర్వేషన్ల విషయంలో ఒక సామూహిక నిర్ణయం తీసుకోవాలి. ఆ తర్వాత రాష్ట్రంలోని అన్ని పార్టీల ప్రతినిధులతో కలిసి అఖిలపక్ష ప్రతినిధి బృందాన్ని కేంద్రం వద్దకు తీసుకెళ్లాలి. ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసుకొని తెలంగాణ బిల్లును వెంటనే పార్లమెంటులో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేయాలి.
ఒకవేళ ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నాయకత్వం ఉన్నందున ఈ అంశాన్ని లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ ప్రస్తావించి బలమైన పోరాటం చేయాలి. అవసరమైతే లోక్‌సభ సమావేశాలను కూడా స్తంభింపజేసి, ఈ అంశాన్ని జాతీయ చర్చగా మార్చాలి. ఇదే విషయాన్ని బీసీ సంఘాలు ముఖ్యంగా బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరమ్ మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నది. కాంగ్రెస్ ఆ ప్రయత్నం చేయకుండా బీసీల దృష్టి మళ్లించడానికి, బీసీల కోసం ఏదో గొప్పగా చేస్తున్నట్టు నటించడానికి రకరకాల పద్ధతులు అవలంబిస్తున్నది. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం బీసీల రిజర్వేషన్లకు అడ్డుపడుతున్నట్టయితే, ఆ విషయాన్ని దేశ ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలి. ధర్నాలు, ఆందోళనలు, బంద్‌లు నిర్వహిస్తూ కేంద్రంపై రాజకీయ ఒత్తిడి తీసుకురావాలి.
బీసీల్లో పెరుగుతున్న అనుమానాలు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తమ ముందు ఉన్న అసలైన కార్యాచరణ చేయకుండా కేవలం ప్రైవేట్ మెంబర్ బిల్లు గురించి మాట్లాడటం వల్ల బీసీల్లో అనుమానం పెరుగుతున్నది. 42% రిజర్వేషన్ అంశాన్ని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఓట్ల కోసం ఉపయోగించి, ఇప్పుడు అదే అంశంతో మళ్లీ బీసీలను మభ్యపెడుతున్నదా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అందుకే కాంగ్రెస్ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా తన వైఖరిని స్పష్టంగా తెలియజేయాలి. రాష్ట్ర ప్రభుత్వం పంపిన బీసీ రిజర్వేషన్ బిల్లు గత 11 నెలలుగా కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నది. ఆ బిల్లును తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చడానికి ఉన్న అభ్యంతరాలు ఏమిటో ప్రజలకు వివరించాలి. అదే విధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను వారం రోజుల్లోనే రాజ్యాంగ సవరణ ద్వారా అమలు చేసిన కేంద్ర ప్రభుత్వం, బీసీలకు సంబంధించిన ఈ బిల్లును ఎందుకు ఆలస్యం చేస్తున్నదో దేశ ప్రజలకు చెప్పాలి.
తెలంగాణలో బీసీలు జనాభాలో మెజారిటీ అయినప్పటికీ, రాజకీయ అధికారంలో వారి ప్రాతినిధ్యం ఇంకా తక్కువగానే ఉన్నది. అలాంటి పరిస్థితిలో 42% రిజర్వేషన్లు కేవలం ఎన్నికల హామీగా కాకుండా రాజ్యాంగబద్ధ హక్కుగా మారాలి. అందుకు మార్గం ఒక్కటేరాజ్యాంగ సవరణ ద్వారా చట్టాన్ని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చడం. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండూ రాజకీయ సంకల్పంతో ముందుకు వస్తేనే ఇది సాధ్యమవుతుంది. లేకపోతే ఈ అంశం కూడా బీసీలను మళ్లీ రాజకీయంగా మభ్యపెట్టే నినాదంగానే మిగిలిపోతుంది.
(వ్యాసకర్త: రిటైర్డ్ ఐఏఎస్, బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం చైర్మన్)
ఎన్నికల ముందు 2023 నవంబర్‌లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా బీసీలకు
42% రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే చట్టబద్ధంగా అమలు
చేస్తామని ప్రకటించింది. ఆ తరువాత రాష్ట్ర ప్రభుత్వం కులగణన నిర్వహించి, కమిషన్ సిఫార్సుల
ఆధారంగా శాసనసభ, శాసనమండలిలో బిల్లును ఆమోదింపజేసింది.
-చిరంజీవులు