అహ్మదాబాద్: ఆక్సిజన్ ట్యాంకర్‌లోని రహస్య అరలో మద్యాన్ని దాచారు. అక్రమంగా రవాణా చేస్తున్న సమాచారం పోలీసులకు తెలిసింది. దీంతో ఆక్సిజన్ ట్యాంకర్‌ను అడ్డుకుని తనిఖీ చేశారు. రూ.64 లక్షల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. (Liquor Hidden In Oxygen Tanker) మద్యంపై నిషేధం అమలులో ఉన్న గుజరాత్లో ఈ సంఘటన జరిగింది. పారిశ్రామిక ఆక్సిజన్ ట్యాంకర్లో మద్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుజరాత్ పోలీసుల స్టేట్ మానిటరింగ్ సెల్‌కు నిఘా సమాచారం అందింది.
కాగా, మహారాష్ట్ర నుంచి గుజరాత్‌లోకి ప్రవేశించిన ట్యాంకర్ వాహనాన్ని వడోదర హైవేపై పోలీసులు అడ్డుకున్నారు. ఆ ఆక్సిజన్ ట్యాంకర్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పారిశ్రామిక గ్యాస్ సిలిండర్ల వెనుక ఉన్న రహస్య అరలో భారీగా మద్యాన్ని దాచినట్లు గుర్తించారు. రూ. 64,65,024 విలువైన 28,704 బాటిల్స్, క్యాన్ల ‘ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్’ను స్వాధీనం చేసుకున్నారు. మద్య నిషేధ చట్టంతో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
మరోవైపు రాజస్థాన్‌లోని జలోర్‌కు చెందిన ట్యాంకర్ డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్‌కు అతడ్ని అప్పగించారు. ఆ ట్యాంకర్ యజమాని, మహారాష్ట్రలోని మద్యం సరఫరాదారులు, వడోదరలో స్వీకరించే వ్యక్తితో సహా నలుగురు నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.