ఉద్యోగ విరమణ చేసిన వారికి బెనిఫిట్స్ ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తున్నది. రెండేండ్లుగా ఆర్థిక ఇబ్బందులతో రిటైర్డ్ ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు. కానీ వారి గోడును ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు ఉద్యోగ ఆరోగ్య పథకం రూపొందిస్తామని సర్కార్ చెప్తున్నది.
ప్రభుత్వం ఉద్యోగుల ఆరోగ్య పథకం విధివిధానాలను లోపభూయిష్టంగా రూపొందిస్తే ఫలితం లేదు. నగదు రహిత వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలి. ప్రతిపాదిత పథకం ప్రకారం మొదటి దశలో రెగ్యులర్ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు మొత్తం 24.21 లక్షల మందికి వైద్య సేవలు అందుతాయని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఉద్యోగులు, పెన్షనర్ల మూలవేతనం/పెన్షన్ నుంచి చేసే 1.5 శాతం మినహాయింపులు, ప్రభుత్వం నుంచి వచ్చే అంతే మొత్తం వాటా రూ.1056 కోట్లుగా ఉంటుందని అంచనా వేస్తున్నది. ఆరోగ్యశ్రీ/ సీజీహెచ్ఎస్ ప్యాకేజీ రేట్లతో పోల్చితే కార్పొరేట్ దవాఖానల బిల్లులు ఎక్కువగా ఉంటున్నాయి. ప్రభుత్వం నిర్ణయించే ప్యాకేజీలు కార్పొరేట్ దవాఖానలు వైద్యం అందించేందుకు వీలుగా రూపొందించాలి. అన్ని దవాఖానాలకు ఒకే విధమైన ప్యాకేజీలు చెల్లిస్తామంటే కొన్ని హాస్పిటల్స్ అంగీకరించకపోవొచ్చు. అప్పుడు ఉద్యోగులు, పెన్షనర్లకు మెరుగైన వైద్యం అందించడం వీలుకాదు.
ఉద్యోగుల నుంచి మినహాయించిన మొత్తానికి సమానంగా ప్రభుత్వం కూడా తన వాటా రెగ్యులర్‌గా జమ చేయాలి. ప్రభుత్వ వాటా జమ చేయకుండా పెండింగ్‌లో పెడితే ఈహెచ్ఎస్ భవిష్యత్తు ఏమిటి? ఆ పరిస్థితుల్లో నగదు రహిత వైద్యం అందేనా ? ప్రభుత్వం ఇప్పటికే రెండేండ్లుగా రిటైర్మెంట్ ప్రయోజనాలు, ఉద్యోగులు పొదుపు చేసుకున్న జీపీఎఫ్, ప్రభుత్వ జీవిత బీమా (జీఎల్ఐ) మొత్తాలను చెల్లించకకుండా నాన్చుతున్నది. దవాఖానలకు చెల్లించాల్సిన ఆరోగ్యశ్రీ డబ్బులు కూడా పెద్ద మొత్తంలో పెండింగ్‌లో ఉన్నాయి. బకాయిలు విడుదల చేయాలని ప్రైవేట్ హాస్పిటళ్ల యాజమాన్యాలు ఆందోళన చేసిన విషయాన్ని కూడా ఉద్యోగులు గుర్తు చేస్తున్నారు. ఉద్యోగుల వేతనాల నుంచి మినహాయించిన మొత్తాన్ని ప్రభుత్వం ఇతర అవసరాలకు వినియోగించకుండా నిబంధనలు రూపొందించాల్సిన అవసరం ఉన్నది.
ఎవరైనా ఉద్యోగి అత్యవసర పరిస్థితిలో దవాఖానలో చేరితే నగదు రహిత వైద్యం అందించాలి. ప్రభుత్వం నిధుల కొరత కారణంగా బిల్లులు చెల్లించకపోవడమో, ప్రభుత్వం నుంచి రీయింబర్స్మెంట్ సకాలంలో రాదనే కారణంగా దవాఖానలు చికిత్స అందించకపోవడమో సరికాదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా చికిత్సకు ఆటంకాలు కలుగకూడదు. ఆరోగ్య కార్డ్ ఉన్న ప్రతి ఉద్యోగి, ఉద్యోగి ఆధారిత కుటుంబ సభ్యులు రెఫరల్ హాస్పిటళ్లలో మెరుగైన వైద్యం కోరుకుంటున్నారు. మరోవైపు ప్రభుత్వం చెప్తున్న హెల్త్ స్కీమ్‌లో ఒక్కో ఉద్యోగి ఏటా రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు చెల్లించాల్సి వస్తుంది. ఇదే మొత్తం ప్రీమియానికి, ఇంతకన్నా తక్కువ మొత్తం ప్రీమియానికి కూడా మార్కెట్లో మెరుగైన ఆరోగ్య బీమా పథకాలు ఉన్నాయి. అంతకంటే మెరుగైన సేవలు అందిస్తేనే ఉద్యోగులు చెల్లించే సొమ్ముకు సార్థకత.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ నిర్వహణలో ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలవుతున్నది. అయితే ఉద్యోగుల చికిత్స ఖర్చుల బిల్లులు దవాఖానలకు ప్రభుత్వం రీయింబర్స్ చేయకపోవడం వల్ల ప్రైవేట్ దవాఖానలు సేవలను నిరాకరిస్తున్నాయి. ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం ఈహెచ్ఎస్ నిబంధనలను రూపొందించాలి. ఈహెచ్ఎస్ పథకంలో 7.14 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లు, పోలీసులను తొలి విడతగా చేర్చనున్నట్టు ప్రభుత్వం చెప్తున్నది. సింగరేణి, ఆర్టీసీ, జెన్కో, ట్రాన్స్‌కో ఉద్యోగులను తర్వాత దశలో చేర్చనున్నారు. ఇంకా 5,000 మంది గ్రంథాలయ ఉద్యోగులు, ఎయిడెడ్ యాజమాన్యంలో పనిచేసే ఉపాధ్యాయులు, లెక్చరర్లు, 3000 మంది మాడల్ స్కూల్ సిబ్బంది, కేజీబీవీ పాఠశాలలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసే బోధన, బోధనేతర సిబ్బంది, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలు, ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు, గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పనిచేసే రెగ్యులర్ ఉద్యోగులు ఉన్నారు. వీరిని ఈహెచ్ఎస్ ఆరోగ్య పథకంలో చేర్చే విషయంలో స్పష్టత లేదు. వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేసే కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సిబ్బంది సుమారు 5 లక్షల మందిని చేర్చాలి. ప్రభుత్వ రంగ సంస్థల సిబ్బంది, విజయ డైరీ, జీహెచ్ఎంసీ ఇంకా ఎయిడెడ్ సంస్థలు, వ్యవసాయ మార్కెట్ కమిటీ, జిల్లా గ్రంధాలయ సంస్థలు, స్పోర్ట్స్ అథారిటీ, ఇంటర్మీడియట్ బోర్డు, వివిధ రెసిడెన్షియల్ పాఠశాలల బోధన, బోధనేతర పెన్షనర్లు, యూనివర్సిటీల నుంచి రిటైరైన పెన్షనర్లను కూడా పథకంలో చేర్చాల్సి ఉన్నది.
మొదటి దశలో ఈహెచ్ఎస్ పరిధిలోనికి రాని ఉద్యోగులంతా వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేసేవారు. ఈ కారణంగా వారికి తెల్లరేషన్ కార్డు రాదు. కాబట్టి ఆరోగ్యశ్రీ పథకం కూడా వర్తించదు. అటు ఈహెచ్ఎస్ వర్తించక, ఆరోగ్యశ్రీ వర్తించక వారు ఇబ్బందులు పడే ప్రమాదమున్నది. అందుకే వారి పట్ల ప్రభుత్వం సానుభూతితో వ్యవహరించి, స్కీమ్‌లో చేర్చాలి. సుమారు 2.6 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులు రెగ్యులర్ స్కేళ్లలో పని చేస్తున్నారు. వారికి ఉద్యోగ విరమణ తర్వాత పెన్షన్ చెల్లింపులు ఉండవు. మరి వారికి రిటైర్మెంట్ తర్వాత ఈ పథకం వర్తింపు ఉంటుందా? ఉంటే మినహాయింపులు జరిగేదెలా? అనే సందేహం కూడా ప్రధానంగా సీపీఎస్ ఉద్యోగులు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఇప్పటికే మూలవేతనంలో, డీఏలో 10% సీపీఎస్ చందాగా మినహాయిస్తుంటే, మరో 1.5 శాతం మినహాయింపు వారికి భారం కానున్నది. వారు ఒక శాతం మినహాయింపును కోరుతున్నారు.
ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు వారి వారి ఆకాంక్షల మేరకు నగదు రహిత చికిత్సను అనుమతించాలి. ప్రభుత్వం విశాల దృక్పథంతో ఉద్యోగుల సంక్షేమాన్ని కాంక్షించి, ఈహెచ్ఎస్ పథకం నిబంధనలను రూపొందించాలి. ఉద్యోగులు, పెన్షనర్లందరు ఈ పథకం పరిధిలోకి వచ్చేలా చూడాలి. ఈహెచ్ఎస్ పథకం ఉద్యోగుల విశ్వాసం చూరగొనేలా నిబంధనలను రూపొందించి అమలు చేయాలి.
కె. వేణుగోపాల్
98665 14577