రామగిరి, మార్చి 28 : హామీల అమలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో శుక్రవారం నల్లగొండ కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ధర్నాకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రైతులు పండించిన పంటలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరల చట్టం చేయాలని, అన్ని రకాల వడ్లను మద్దతు ధరకు కొనుగోలు చేసి వెంటనే బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయోత్పత్తులకు కేంద్రం ప్రకటించిన మద్దతు ధరలు రైతాంగ ఆత్మైస్థెర్యాన్ని కుంగతీసే విధంగా ఉన్నాయన్నారు.
ఎన్నికల ముందు వ్యవసాయ ఉత్పత్తులకు స్వామినాధన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం మద్దతు ధరలు నిర్ణయించి అమలు చేస్తామన్న మోదీ మాటలు నీటమూటలయ్యాయాని ఎద్దేవా చేశారు. ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల గురించి కేంద్రం మాట్లాడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన రేషన్ కార్డులు, పింఛన్లు, ఇందిరమ్మ ఇండ్లు ఎప్పటి వరకు ఇస్తారో నిర్ధిష్టమైన కాలపరిమితి ప్రకటించాలని అన్నారు. మహాలక్ష్మి పథకం, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని వెంటనే అమలు చేయాలని తెలిపారు. ధాన్యం కేంద్రాలను సత్వరమే ప్రారంభించాని, డబుల్ బెడ్రూం ఇండ్లను లబ్ధిదారులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ధర్నాలో పార్టీ శ్రేణులు పాలడుగు నాగార్జున, ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, బండ శ్రీశైలం, నారి ఐలయ్య, పాలడుగు ఫ్రభావతి, లక్ష్మీనారాయణ, పి.నర్సిరెడ్డి, అనూరాధ, తదితరులు పాల్గొన్నారు.