నార్కట్పల్లి, జూన్ 22 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులను విస్మరిస్తున్నారని, రూ. రెండు లక్షల రుణ మాఫీపై స్పష్టత ఇవ్వాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నార్కట్పల్లిలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నోరు తెరిస్తే రూ. 2లక్షల రుణ మాఫీ అంటున్నాడని, రాష్ట్రంలో ఏ బ్యాంకులోనైనా ఏ ఒక్క రైతుకైనా రూ. 2లక్షల రుణం ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా ప్రశ్నించారు. డిసెంబర్ 9, 2023 నుంచి ఆగస్టు 15 మళ్లీ తిరిగి డిసెంబర్ 15 ఇలా తేదీలు మార్చడమే తప్ప రుణమాఫీ జరిగేటట్లు లేదని, ముందు దానిపై శ్రద్ధ పెట్టాలని అన్నారు.
రైతు రుణ మాఫీ ఏ ప్రాతిపాదికన చేస్తున్నారని, దానికి అర్హులు ఎవరు, ఎలా గుర్తిస్తారు, విధివిధానాలు ఏమిటో చెప్పాలన్నారు. ఏడు నెలలు గడిచినా రైతు బంధు ఎకరానికి రూ.15 వేలు ఏమయ్యాయని, సబ్ కమిటీలు వేస్తున్నామని చెప్తూ కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ హయాంలో 9 సంవత్సరాలు సమయానికి రైతు బంధు, విత్తనాలు, ఎరువుల పంపిణీ చేయగా, కాంగ్రెస్ సర్కారులో ఎందుకు నిర్లక్ష్యం జరుగుతున్నదని తెలిపారు. ఇప్పుడు 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదని, రైతు బీమా ఊసేలేదని మండిపడ్డారు. ప్రజలు నమ్మి గెలిపిస్తే కాంగ్రెస్ చేసేది ఇదేనా? ఇకకైనా ప్రజలు, రైతుల శ్రేయస్సు కోసం పాలనపై దృష్టి పెట్టాలని చెప్పారు. కక్ష్య సాధింపు చర్యలు, బెదిరింపులకు పాల్పడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఆయన వెంట బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు, ఎంపీటీసీ చిరుమర్తి యాదయ్య ఉన్నారు.