చిట్యాల, ఫిబ్రవరి 7 : పోరాడి సాధించుకున్న తెలంగాణ అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వమే మళ్లీ రావాలని జనం కోరుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 3,5,6 వార్డుల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనతో విసుగెత్తిన జనం సారూ..కారు.. సర్కారే మళ్లీ రావాలని కోరుకుంటున్నారన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడే అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేశారని, బీఆర్ఎస్ను ఓడించి తప్పు చేశామని జనం భావిస్తున్నారన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చిట్యాల మున్సిపాలిటీని అభివృద్ధి చేశానని వివరించారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరును గ్రహించి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించేందుకు జనం సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ విషయాన్ని గ్రహించే ప్రజలపై వత్తిడి తెస్తూ, బెదిరిస్తున్నారన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుస్తున్నారనే విషయం గ్రహించి, బీఆర్ఎస్ నాయకులపై కూడా వత్తిడి తెస్తున్నారన్నారు. పట్టణంలోని ప్రతీ వార్డును అభివృద్ధి చేశామని, ఏవో చిన్న సమస్యలు మిగిలి ఉండవచ్చని అన్నారు. ప్రజలు ఓటు వేసే ముందు అలోచించి, చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలన్నారు. కార్యక్రమంలో వార్డు అభ్యర్థులు శేపూరి జయమ్మ రవీందర్, దయ్యాల సమతా శ్రీకాంత్, జడల సంతోషి ఆదిమల్లయ్య, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.