మిర్యాలగూడ, డిసెంబర్ 4 : బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోనే ఉంటూ వారికి ఎల్లవేలలా అండగా నిలువాలని మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు సూచించారు. సోమవారం పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ పట్టణస్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్‌తో కలిసి ఆయన మాట్లాడారు.
పదేండ్లపాటు అధికారంలో ఉండి అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను అందించామన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత చేసే అభివృద్ధిపై బీఆర్ఎస్ శ్రేణులు దృష్టిసారించాలని, వారి వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రజలతో కలిసి ఎండగట్టాలని సూచించారు.
ఓటమితో కుంగిపోకుండా ముందుకు సాగాలని సూచించారు. తాను స్థానికంగా ఉంటూ కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఎల్లవేళలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మిర్యాలగూడ నియోజకవర్గం, మండల, గ్రామస్థాయి నాయకులందరూ ఎప్పటి లాగానే పార్టీ పటిష్టత కోసం పనిచేయాలని కోరారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర నాయకులు పెద్ది శ్రీనివాస్‌గౌడ్, నల్లమోతు సిద్ధార్థ, పట్టణ ముఖ్య నాయకులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.