నల్లగొండ ప్రతినిధి, జనవరి 27 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించినందుకు ప్రజలను చెప్పులతో కొడతారా? అని మంత్రులను బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సూటిగా ప్రశ్నించారు. ఎన్నికల్లో అధికారం కోసం అడ్డగోలు హామీలిచ్చి ఇప్పుడు అమలు చేయలేక ఎదురుదాడికి దిగుతున్నారని విమర్శించారు. ప్రశ్నిస్తే తట్టుకోలేక అసహనంతో మంత్రులు బూతులు మాట్లాడుతున్నారన్నారు.
అధికారంలోకి రాగానే ఎకరాకు రూ.15వేల చొప్పున రైతుబంధు డబ్బులు ఇస్తామని చెప్పి ఇప్పుడు మాట మార్చి రూ.10 వేల చొప్పున కూడా ఇవ్వలేకపోతున్నది నిజం కాదా? అని ప్రశ్నించారు. రైతుబంధు డబ్బులు అందడం లేదని ప్రశ్నిస్తే చెప్పుతో కొడతామనడం కాంగ్రెస్ మంత్రుల అహంకారానికి నిదర్శమన్నారు. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటుదామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇటీవలే లోక్‌సభ నియోజకవర్గాల వారీగా సమీక్షలు పూర్తిచేసుకున్న బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా విస్తృత స్థాయి సమావేశాలకు సన్నద్ధమైంది.
అందులోభాగంగా శనివారం నల్లగొండలో నియోజకవర్గ శ్రేణులతో ఆత్మీయ సమావేశం నిర్వహించింది. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి పెద్ద సంఖ్యలో పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. ముఖ్య అతిథిగా మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి హాజరై ప్రసంగించారు. గత నెల 9న సోనియాగాంధీ జన్మదినం నుంచే అమలు చేస్తామన్న రూ.2లక్షల రుణమాఫీ ఏమైందని ప్రశ్నించారు.
హామీలు అమలుచేయలేక, పాలన చేతకాక కేసీఆర్‌పై నెపం నెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారని పేర్కొన్నారు. ఇక హామీల అమలు గురించి ప్రశ్నిస్తే మంత్రులు వ్యక్తిగత దూషణలు చేస్తున్నారని, తాము అదే దారిలోకి వస్తే కాంగ్రెస్ మంత్రులు తట్టుకోలేరని హెచ్చరించారు. కేసులు, దాడులతో భయపెట్టాలని చూస్తున్నారని, తమ పార్టీ శ్రేణులకు, తమకు అవి కొత్తేమీ కాదని, ఉద్యమకాలం నుంచే ఇలాంటివి తట్టుకుని నిలబడ్డామని గుర్తుచేశారు.
తాము అధికారంలో ఉండగా ఇలాంటి వాటిని ప్రోత్సహించలేదని, అధికారం శాశ్వతం కాదని హితవు పలికారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీల అమలుకు ప్రజల పక్షాన పోరాటానికి సిద్ధం కావాలన్నారు. అప్పుడే కరెంటు కోతలు మొదలయ్యాయని, మహాలక్ష్మి పథకంతో జుట్లు పట్టుకునేలా చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ హయాంలోనే రాష్ట్రం అభివృద్ధిలో అగ్రస్థానంలోకి దూసుకెళ్లిందని, ఆయన రాష్ర్టాన్ని సొంత కుటుంబంలా భావించి తీర్చిదిద్దారని తెలిపారు. కేసీఆర్ చేతుల్లోనే తెలంగాణ సురక్షితంగా, సుభిక్షంగా ఉంటుందని స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు కృష్ణా జలాలను నాటి ముఖ్యమంత్రులు వైఎస్, చంద్రబాబు అక్రమంగా తరలించుకుని పోతుంటే హారతులు పట్టిన చరిత్రహీనులు నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పెద్దలని విమర్శించారు. ప్రస్తుతం సాగర్ ఎడమ కాల్వకు నీళ్లు ఇవ్వలేకపోతున్నారని అన్నారు. ఇక ఎస్ఆర్ఎస్పీలో నీళ్లున్నా వాటిని వినియోగించుకునే తెలివి లేదన్నారు. రైతులకు ఉద్దేశపూర్వకంగానే సాగునీళ్లు ఇవ్వడం లేదని ఆరోపించారు. నల్లగొండ జిల్లా నుంచే కాంగ్రెస్‌పై పోరాటం షురూ చేస్తామని, తెలంగాణ సమాజానికి పోరాటాలు నేర్పిందే నల్లగొండ జిల్లా అని అన్నారు.
అధికారంలోకి వచ్చిందే తడవుగా బీజేపీతో కుమ్మక్కై బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానాలకు కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నదన్నారు. సూర్యాపేటలో అలాంటి అక్రమ కుమ్మక్కును బీఆర్ఎస్ తిప్పికొట్టిందని, సూర్యాపేట నుంచే తిరిగి విజయబావుటా మొదలైందన్నారు. వారం, పది రోజుల్లో గులాబీ బాస్ కేసీఆర్ ప్రజల్లోకి వస్తారని, త్వరలోనే నల్లగొండ పర్యటనకు రానున్నారని జగదీశ్‌రెడ్డి వెల్లడించారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు పార్టీ శ్రేణులంతా సమన్వయంతో ముందుకు సాగాలన్నారు.
సమావేశంలో ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, యాదాద్రిభువనగిరి జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు, పార్టీ నేతలు చాడ కిషన్‌రెడ్డి, కంచర్ల కృష్ణారెడ్డి, రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, మందడి సైదిరెడ్డి, నిరంజన్‌వలీ, పంకజ్ యాదవ్, అభిమన్యు శ్రీనివాస్, బోనగిరి దేవేందర్, బొర్రా సుధాకర్, తండు సైదులుగౌడ్, సహదేవరెడ్డి, కరీంపాషా, పల్రెడ్డి రవీందర్‌రెడ్డి, దేప వెంకట్‌రెడ్డి, ఐతగోని యాదయ్య, శరణ్యారెడ్డి, రావుల శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
నల్లగొండ జడ్పీ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో ఫలితాలపై ఆత్మ పరిశీలన చేసుకొని ముందుకు సాగాలన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ప్రజలు నమ్మారని, కానీ ఇప్పుడు అమలు చేయడం అంతసులువు కాదని అన్నారు. హామీల అమలుపై ప్రజలతో కలిసి పోరాడేందుకు సిద్ధం కావాలని కోరారు. ప్రజల పక్షాన నిలబడి కష్టపడితే తిరిగి బీఆర్ఎస్దే అధికారమన్నారు.
బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు చేరవేయడంలో విఫలమయ్యామన్నారు. గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసుకుందామని, రానున్న ఐదేళ్లు కష్టపడితే మళ్లీ మనదే అధికారం అని పేర్కొన్నారు. ఎంపీ, ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. అందుకోసం అందరం సమన్వయంతో ముందుకు సాగుదామని చెప్పారు.
నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. రానున్న ఎంపీ, ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసికట్టుగా సాగుదామని అన్నా రు. పార్టీ ఆదేశాల మేరకు అందరం కలిసి పనిచేద్దామని, చిన్న చిన్న తగాదాలు పక్కన పెట్టి పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలన్నారు. రా నున్న కాలంలో పార్టీని మరింత బలోపేతం చేసుకునేందుకు సంస్థాగతంగా అన్ని కమిటీలు వేసుకుందామని చెప్పా రు. కాంగ్రెస్ దాడులను ఎదుర్కొని కార్యకర్తలను కాపాడుకుందామని, ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదన్నారు.
తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి ప్రజలను తప్పుపట్టకూడదని, పార్టీ అభ్యర్థుల ఓటమికి కారణాలను విశ్లేషించుకోవాలని అన్నారు. జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుంటూ ముందుకు సాగుదామని చెప్పారు. వచ్చే ఎంపీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కష్టపడాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ విజయమే లక్ష్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు.