యాదగిరిగుట్ట, ఏప్రిల్ 5 : ఉగాది పండుగ రోజున ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 60 మద్యం దుకాణాలను ప్రారంభించి రాష్ట్రవ్యాప్తంగా మద్యాన్ని ఏరులై పారించేందుకు ప్రయత్నాన్ని ముమ్మరం చేశారని డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి విమర్శించారు. గ్రామాల్లో బెల్టు షాపులను తెరిచే ఉంటాయని ఎక్సైజ్ శాఖ అధికారులు బాహాటంగానే చెప్తుండడం విడ్డూరంగా ఉందన్నారు. శనివారం యాదగిరిగుట్ట పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో నియోజకవర్గంలోని పార్టీ మండలాధ్యక్షులు, యువజన, విద్యార్థి విభాగాలు, సోషల్ మీడియా ఇన్‌చార్జీలతో ఆయన సమావేశమయ్యారు. ఈ నెల 27న వరంగల్‌లో జరగనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని కోరుతూ యాదగిరిగుట్ట మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో గజ్వేల్ నియోజకవర్గంలోని మర్కూక్ దేవస్థానం వరకు తలపెట్టిన పాదయాత్రపై అభిప్రాయాలు సేకరించారు.
ఈ సందర్భంగా మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ నేడో, రేపో పాదయాత్ర తేదీని ప్రకటిస్తామన్నారు. సుమారు వెయ్యి మందితో పాదయాత్ర ఉంటుందని, ఒక్కో మండలం నుంచి 200 నుంచి 250 మందికి వరకు పాల్గొనాలని కోరారు. లక్ష్మీనరసింహ స్వామి ఆలయ వైకుంఠ ద్వారం వద్ద ప్రారంభమైన మల్లాపురం మీదుగా తుర్కపల్లి మండల కేంద్రం, వాసాలమర్రి మీదుగా పాదయాత్ర సాగుతుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ పాలనే రావాలని జనం కోరుకుంటున్నారని, ఎక్కడికి వెళ్లినా కేసీఆర్ పాలనే బాగుందని గుర్తుచేస్తున్నారని వివరించారు. ఆదాయం పెంచుకోవాలన్న యావలో రేవంత్ సర్కారు బడ్జెట్లో రూ.50 వేల కోట్లు ఎక్సైజ్ శాఖ నుంచి సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుని బార్లు ప్రారంభించేందుకు సిద్ధమైందన్నారు. యువతకు మత్తులో దించి తాగుబోతులను చేయాలని చూస్తున్నదని మండిపడ్డారు. హామీలు, అభివృద్ధిని పక్కన పెట్టిన ధనార్జనే ధ్యేయంగా పాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు.
సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ వివిధ మండలాల అధ్యక్షులు కర్రె వెంకటయ్య, గంగుల శ్రీనివాస్, పొలగాని వెంకటేశ్‌గౌడ్, పిన్నపునేని నరేందర్‌రెడ్డి, సట్టు తిరుమల్లేశ్, బొట్ల యాదయ్య, ఎండీ ఖలీల్, బీసు చందర్‌గౌడ్, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ బీకూనాయక్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గడ్డమీది రవీందర్‌గౌడ్, వైస్ చైర్మన్ గ్యాదపాక నాగరాజు, బీఆర్ఎస్వీ జిల్లా కన్వీనర్ ప్రవీణ్‌రెడ్డి, నియోజకవర్గ కన్వీనర్ ర్యాకల రమేశ్, సోషల్ మీడియా కన్వీనర్ నల్ల శ్రీకాంత్, వివిధ మండలాల యువజన విభాగం అధ్యక్షులు బీస కృష్ణంరాజు, ఎండీ అజ్జు, సందిళ్ల భాస్కర్‌గౌడ్, పన్నాల నవీన్‌రెడ్డి, ముక్యర్ల సతీశ్ యాదవ్, విద్యార్థి విభాగం నియోజకవర్గ కన్వీనర్ ఒగ్గు మల్లేశ్, మాజీ సర్పంచ్ కసావు శ్రీనివాస్‌గౌడ్, నాయకులు మిట్ట వెంకటయ్యగౌడ్, శారాజీ రాజేశ్‌యాదవ్, బాలరాజు పాల్గొన్నారు.