సూర్యాపేట టౌన్, జనవరి 21 : బాధితులు ఇక ఇంటి నుండే ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసుకునే అవకాశం కల్పించడం జరుగుతుందని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. బాధితులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఫోన్ చేస్తే పోలీసులు ఇంటికే వచ్చి పిర్యాదులు స్వీకరించి కేసులు నమోదు చేసి భరోసా కల్పించడం కోసం సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖ కృషి చేస్తుందన్నారు. పోలీసు సేవల్లో పారదర్శకత కోసం తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ అమలులోకి తెచ్చిన నూతన ప్రణాళిక కార్యాచరణను జిల్లాలో పటిష్టంగా అమలు చేస్తామని తెలిపారు.
శారీరక దాడులకు గురైయ్యే వారికి, ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలకు, బాలలకు, ర్యాగింగ్ కు గురయ్యే విద్యార్థులకు, వేధింపులకు గురయ్యే మహిళలకు ఇది ఎంతో సహాయ పడనుందన్నారు. దీని ప్రకారం అన్ని పోలీస్ స్టేషన్ల సిబ్బంది, అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఫోన్ కాల్, ఆన్లైన్ అభ్యర్థన లేదా ఇతర మార్గాల ద్వారా సమాచారం అందగానే సంబంధిత పోలీస్ సిబ్బంది బాధితుల నివాసానికి చేరుకుని ఫిర్యాదు నమోదు చేస్తారని తెలిపారు. ఈ విధానం ద్వారా ఫిర్యాదుల నమోదు ప్రక్రియ మరింత వేగవంతం అవడంతో పాటు పోలీస్ వ్యవస్థపై ప్రజల నమ్మకం పెరుగుతుందని తెలిపారు.