రామగిరి (నల్లగొండ), మార్చి 9 : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ప్రణయ్ హత్య కేసు విచారణ తుది దశకు చేరింది. ఇప్పటికే వాదనలు, విచారణ పూర్తి చేసిన కోర్టు ఈ నెల 10న తుది తీర్పు వెల్లడించనుంది. 2018 సెప్టెంబర్ 14న మిర్యాలగూడలో ప్రణయ్ హత్యకు గురైన సంగతి తెలిసిందే. తన కూతురు అమృతను కులాంతర వివాహం చేసుకున్నాడనే కక్షతో ఆమె తండ్రి మారుతీరావు సుఫారీ గ్యాంగ్ తో ప్రణయ్‌ను హత్య చేయించినట్లు ఆరోపణలు.
మారుతిరావుతో పాటు అస్గర్ అలీ, అబ్దుల్ భారీ, ఎంఏ కరీం, శ్రావణ్ కుమార్, ఆటో డ్రైవర్ నిజాం, మారుతీరావు కారు డ్రైవర్ శివ ఇతర నిందితులుగా ఉన్నారు. ప్రణయ్ తండ్రి పెరుమాళ్ల బాలస్వామి ఫిర్యాదు మేరకు, పోలీసులు నిందితులపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం, హత్య ఆరోపణల కింద అరెస్టు చేశారు. 2019లో సుభాష్ శర్మ తప్ప మిగతా వారందరికీ బెయిల్ లభించింది. ప్రధాన నిందితుడు మారుతీరావు మార్చి 7, 2020న ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రణయ్ కుటుంబ సభ్యులు, ప్రజా సంఘాల నేతలు, ప్రజలు కోర్టు తుది తీర్పుపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.