నకిరేకల్, ఆగస్టు 22: ‘ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి నల్లగొండ జిల్లా రైతుల ఆక్రందన వినబడట్లేదా? పోతిరెడ్డిపాడు నుంచి ఆంధ్రాకు నీళ్లు తరలించుకుపోతుంటే సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ఎందుకు మౌనం వహిస్తున్నారు. చెరువుల్లో నీటిని నింపకుండా కాంగ్రెస్ నాయకులు మట్టిమాఫియాకు తెరలేపారు. కేసీఆర్ హయాంలో రెండు పంటలకు నీరందించారు. రేవంత్‌రెడ్డి ఒక్క పంటకు కూడా నీరు అందించలేకపోతున్నారు. నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ద్వారా జిల్లాలోని చెరువులు, కుంటలు నింపి రైతాంగాన్ని కాపాడాలి. లేనిపక్షంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతాం’ అని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హెచ్చరించారు. నకిరేకల్ పట్టణ కేంద్రంలోని పాత హైవే పక్కన గల పెద్ద చెరువును బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కలిసి పరిశీలించారు. అనంతరం సాగు, తాగునీటి పరిస్థితులపై మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నాగార్జునసాగర్‌లో 510 అడుగుల నీటి మట్టం ఉన్నప్పటికీ ఎడమ కాల్వ ద్వారా నల్లగొండ జిల్లా రైతులకు రెండు పంటలకు నీరందించారని గుర్తుచేశారు.
ప్రస్తుతం సాగర్‌లో 532 అడుగుల నీటిమట్టం ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎందుకు నీరు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. వరికి సరిగా నీరందక, భూగర్భజలాలు అడుగంటిపోయి జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్‌నినో ఎఫెక్ట్, వర్షాభావ పరిస్థితులపై శాస్త్రవేత్తలు ముందుగానే హెచ్చరించినా ప్రభుత్వం రైతులకు సరైన మార్గదర్శకాలు ఇవ్వలేదని విమర్శించారు. ఎడమ కాల్వ కింద సాగు, తాగు నీరందించడంలో ఇరిగేషన్ మంత్రి, కాంగ్రెస్ జిల్లా సీనియర్ నాయకులు విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీశైలం నుంచి పుష్కలంగా నీరు వస్తున్నప్పటికీ సాగర్ ప్రాజెక్టును ఎందుకు నింపడం లేదని ప్రశ్నించారు. పోతిరెడ్డి ప్రాజెక్టు ద్వారా పెద్ద ఎత్తున ఆంధ్రాకు నీళ్లు తరలించుకుపోతుంటే ప్రభుత్వం, మంత్రులు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.
సీఎం రేవంత్‌రెడ్డి, జిల్లా మంత్రులు నల్లగొండ జిల్లాకు సాగు, తాగునీటి సరఫరాపై నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో గత 10 ఏండ్లల్లో పంటలకు క్రమం తప్పకుండా సాగు, తాగు నీరందించామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు నీరందించలేకపోతోందని ప్రశ్నించారు. బ్రాహ్మణవెల్లెంల ఎత్తిపోతల పథకం వంటి ప్రాజెక్టులు పూర్తి చేయకుండా నీటిని వృథాగా వదిలేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో ప్రాజెక్టులు పూర్తి చేయకుండా.. కాళేశ్వరం నీళ్లను కరీంనగర్, వరంగల్, మెదక్ జిల్లాలకు అందించకుండా కాలయాపన చేస్తున్నారని అన్నారు. నీళ్లు ఆంధ్రాకు తరలిపోతున్నాయన్నారు. రైతులకు యూరియా సరిపడా ఇవ్వలేక, విద్యుత్ సరఫరా సరిగా చేయలేక, పండిన పంటలు కొనలేక ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి అట్టర్‌ఫ్లాప్ అయ్యారని విమర్శించారు. జిల్లాలో భూగర్భజలాలు ఇంకిపోయి, బోర్లలో నీళ్లు లేక తాగునీరు కూడా దొరకని పరిస్థితి ఏర్పడిందన్నారు. నల్లగొండ జిల్లాలో ఎడమ కాల్వ కింద గల చెరువులు, కుంటలను నింపాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుల నాయకత్వంలో రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు.
నకిరేకల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకులు కేవలం డబ్బు సంపాదనపైనే దృష్టి పెట్టారని చెప్పారు. చెరువులలో నీటిని నింపకుండా అడుగంటిన చెరువులను సాకుగా చూపి మట్టిని వ్యాపారంగా మార్చుకుని మాఫియాకు తెరలేపుతున్నారన్నారు. దీంతో భూగర్భజలాలు మరింత తగ్గిపోయి పంటలకు నీరు లేక రైతులు అరిగోస పడుతున్నారన్నారు. నకిరేకల్ పట్టణం, మండలంలోని పెద్దచెరువు, భూపతికుంటల నుంచి అక్రమంగా మట్టిని తరలిస్తున్నారని చెప్పారు. పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు వృథా కాకుండా నాగార్జున సాగర్‌ను నింపి ఎడమ కాల్వ ద్వారా జిల్లాకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నకిరేకల్, కేతేపల్లి బీఆర్ఎస్ మండల అధ్యక్షులు ప్రగడపు నవీన్‌రావు, మారం వెంకట్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి నోముల కేశవరాజు, యూత్ అధ్యక్షుడు పేర్ల కృష్ణకాంత్, కడపర్తి, తాటికల్, కొర్లపహాడ్ సర్పంచులు గొర్ల వీరయ్య, బంటు రవి, సైదిరెడ్డి, మాజీ కౌన్సిలర్ పల్లె విజయ్, సీనియర్ నాయకులు రావిరాల మల్లయ్య, యానాల లింగారెడ్డి, గుర్రం గణేష్, ఇమడపాక వెంకన్న, జానకిరాంరెడ్డి, ఎమ్‌డి జాఫర్, ఎస్కె అమీర్‌పాషా, కొండ వినయ్, అవిరెండ్ల జనార్దన్, ముక్కాముల శ్రీనివాస్, చిట్యాల అశోక్ తదితరులు పాల్గొన్నారు.