చండూరు, ఆగస్టు 30 : చండూరు మండల ఫర్టిలైజర్స్ దుకాణదారులు రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని తెలంగాణ ఉద్యమకారుడు కళ్లెం సురేందర్ రెడ్డి ఆరోపించారు. శనివారం చండూరు మండల కేంద్రంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 45 కిలోల యూరియా బస్తా రూ.270 ఉంటే చండూరు మండల కేంద్రంలో ఉన్నటువంటి ఫర్టిలైజర్ షాప్స్ యజమానులు మాత్రం అదే బస్తాను రూ.400కు విక్రయిస్తున్నట్లు తెలిపారు. రవాణా చార్జీ పేరిట బస్తాకు రూ.20 నుండి రూ.30 వరకు అదనంగా వసూలు చేస్తున్నట్లు దుయ్యబట్టారు. సబ్సిడీపై అందించాల్సిన యూరియా బినామీల పేరిట ఫర్టిలైజర్ దుకాణాల యాజమానులే నడిపిస్తున్నట్లు తెలిపారు. చండూరుకు వచ్చే టన్నుల కొద్ది యూరియాను బ్లాక్ చేసి ఫర్టిలైజర్ షాపులకు గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నారని దుయ్యబట్టారు.
వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం తూతూ మంత్రంగా తనిఖీలు చేసి చేతులు దులుపుకుంటున్నట్లు ఆరోపించారు. ఏ మందుల దుకాణాల ఎదుట స్టాక్ సూచికలు కనిపించడం లేదన్నారు. అధికారుల పర్యవేక్షణ లోపంతో ఫర్టిలైజర్స్ షాపుల వారు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తూ రైతులకు యూరియా అవసరముంటే ఇంకా ఏమైనా మందులు తీసుకుంటేనే యూరియా ఇస్తామని ముడిపెడుతున్నట్టు తెలిపారు. ఇప్పటికైనా వ్యవసాయ అధికారులు స్పందించి షాపుల్లో తనిఖీలు నిర్వహించి రైతులకు న్యాయం చేసి, సకాలంలో అందరికీ యూరియా అందుబాటులో ఉండేలా చూడాలని ఆయన పేర్కొన్నారు.