సూర్యాపేట, నవంబర్ 12:కొద్ది సంవత్సరాలుగా పేరుకుపోయిన ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు బుధవారం సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ స్టూడెంట్స్ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు బారి అశోక్‌కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తోందన్నారు. తమ ప్రభు త్వం అధికారంలోకి రావడానికి విద్యార్థి, నిరుద్యోగులదే కీలకపాత్ర అని స్వయాన ముఖ్యమంత్రే ప్రకటించి నేడు వారినే మోసగించడం అనైతికమన్నారు.
రీయింబర్స్మెంట్ బకాయిలు విద్యార్థుల చదువులకు ఆటంకంగా మారుతున్నాయన్నారు. వెంటనే పెం డింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేయకపోతే లక్ష మంది విద్యార్థులతో కలిసి రాజధానిని ముట్టడిస్తామని హెచ్చరించారు. సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం డంబాచారాలకే పరిమితమై నిరుద్యోగులను దగా చేస్తోందన్నారు. కార్యక్రమంలో విద్యార్ధి జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.