నల్లగొండ ప్రతినిధి, జూలై31(నమస్తే తెలంగాణ)/మిర్యాలగూడ/ పీఏపల్లి: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు శ్రీశైలం నుంచి భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలో సాగర్ ఆయకట్టు రైతాంగంలో ఆశలు చిగురిస్తున్నాయి. అక్టోబర్ వరకు కృష్ణానదిలో వరదలు వచ్చే అవకాశం ఉండడంతో ఇప్పటికే ఎగువన ఉన్న అన్ని ప్రాజెక్టులు నిండడంతో ఇక మిగిలింది సాగర్ ప్రాజెక్టే. కాబట్టి వచ్చే ప్రతి నీటి చుక్కు సాగర్‌కే రానున్న నేపథ్యంలో ముందస్తుగానే సాగునీటి విడుదల కోసం రైతుల నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
గతేడాది వర్షాభావ పరిస్థితులతో యాసంగిలో పంటలకు నీరివ్వలేదు. వానకాలంలోనూ వేసిన పంటలను కాపాడేందుకు ఉన్న నీటినే పొదుపుగా వాడుకునేలా అప్పటి కేసీఆర్ సర్కార్ సాగునీటిని విడుదల చేసి పంటలను కాపాడింది. వరుసగా రెండు పంటలు సరిగ్గా పండని నేపథ్యంలో ప్రస్తుతం వస్తున్న వరదలపై రైతులు ఆశలు పెంచుకుంటున్నారు.
ఈ సీజన్లో కనిష్టంగా నాగార్జునసాగర్‌లో నీటిమట్టం 503 అడుగులకు పడిపోయింది. శ్రీశైలం నుంచి వస్తున్న వరద ఉధృతితో బుధవారం సాయంత్రం 6గంటల సమయానికి సాగర్‌లో నీటిమట్టం 526.80అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 2.18లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతున్నది. దీంతో వేగంగా సాగర్ నీటిమట్టం పెరుగుతున్నది. ఇప్పటికే కుడి కాల్వ ద్వారా 5,944 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
సాగర్ ఎడమకాల్వతో పాటు ఏఎంఆర్పీ ఆయకట్టుకు సైతం నీటిని విడుదల చేయాలని గత రెండుమూడు రోజులుగా రైతులు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఎగువ నుంచి భారీ వరద వస్తున్నందున ముందుగానే నీటిని విడుదల చేయడం వల్ల సకాలంలో నారుమళ్లు పోసుకుంటామని ఎడమకాల్వ పరిధిలోని రైతులు కోరుతున్నారు.
ఎడమకాల్వకు నీటిని వదిలితే ఆ పరిధిలోని చెరువులు, కుంటలు కూడా నిండనున్నాయి. దీంతో బోర్లు, బావుల్లోకి నీరు వచ్చినా సరే ఆ నీటితోనైనా నారుమళ్లు సిద్ధం చేసుకోవచ్చని రైతులు భావిస్తున్నారు. ఇక ఇదే సమయంలో ఏఎంఆర్పీ ఆయకట్టు పూర్తిగా చెరువులు, కుంటలపైనే ఆధారపడి ఉంటుంది. ఇక్కడ చెరువులు నింపడం వల్ల భూగర్భజలాలు పెరిగి బోర్లు, బావుల్లో నీరు అందుబాటులోకి రానుంది. దీని ద్వారా వరి పంటతో పాటు తోటలకు ఉపయుక్తం కానుంది.
ఏఎమ్మార్పీ పరిధిలో…
సాగర్ జలాలపై ఆధారపడిన ఏఎమ్మార్పీ ద్వారా తాగునీటి కోసం ప్రధానకాల్వ వెయ్యి క్యూసెక్కులు మాత్రమే విడుదల చేస్తున్నారు. మిగతా అన్ని డిస్ట్రిబ్యూటరీలకు నీటి విడుదల నిలిపేశారు. ఆయకట్టు పరిధిలోని 55 డిస్ట్రిబ్యూటరీలతో పాటు 90 పైగా చెరువుల కింద సాగు చేసే రైతులు ఈ సీజనులో సాగుకు సన్నద్ధం అవుతున్నారు. గత యాసంగిలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందు చూపు కొరవడడంతో ప్రాజెక్టు పరిధిలో ఒక్క చెరువు కూడా నింపలేదు. దీంతో భూగర్భజలాలు అడుగంటి బావులు, బోర్లు ఎండిపోయి వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి.
ఏండ్ల తరబడి పెంచుకున్న తోటలను కాపాడుకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ నేఫథ్యంలో ప్రస్తుత సాగర్‌కు వరద పోటెత్తుతుండడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ప్రస్తుతం ఏఎమ్మార్పీ ద్వారా రెండు మోటర్లద్వారా 900 క్యూసెక్కులు విడుదల చేస్తూ ఏకేబీఆర్ నుంచి 1000 క్యూసెక్కులు ప్రధాన కాల్వ నల్లగొండ తాగునీటి కోసం తరలిస్తున్నారు. తాగునీటితో పాటు చెరువులు, కుంటలు నింపాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయమై మంగళవారం కనగల్‌కు చెందిన కొందరు రైతులు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని కలిసి విజ్ఞప్తి కూడా చేశారు.
ఎల్లుండి ఎడమ కాల్వ నీటి విడుదలకు సన్నాహాలు
నందికొండ, జూలై 31 : నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ఆయకట్టుకు ఆగస్టు రెండున నీటి విడుదల చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు హాజరునున్నట్లు ఎన్నెస్పీ అధికారులు తెలిపారు.
ఈ మేరకు ప్రాజెక్టు ఈఈ మల్లికార్జునరావు, డీఎస్పీ రాజశేకర్రాజు బుధవారం ఎడకాల్వ పరిసరాలు, బీసీ గురుకుల పాఠశాలో హెలీపాడ్ ఏర్పాట్లను పరిశీలించారు. శ్రీశైలం నుంచి 2,17,239 క్యూసెక్కల ఇన్‌ఫ్లో నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు వచ్చి చేరుతుండడంతో ఒక్క రోజు వ్యవధిలోనే సాగర్ నీటి మట్టం 10 అడుగుల మేర పెరిగి 515 అడుగుల నుండి 525.60 అడుగులకు (159.6859 టీఎంసీలు) చేరింది.
ఇన్‌ఫ్లో ఇదే స్థాయిలో కొనసాగితే నాగార్జునసాగర్ రిజర్వాయర్ పూర్తి స్థాయికి చేరి నిండు కుండలాగా మారి, ఎడమకాల్వ కింద పంటలకు పుష్కలంగా నీరు అందే అవకాశం ఉందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. శ్రీశైలం రిజర్వాయర్‌కు 3,62,411 క్యూసెక్కల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతుండగా, 10 క్రస్ట్ గేట్లు, జల విద్యుత్ కేంద్రాల ద్వారా 2,17,239 కూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి కుడి కాల్వ ద్వారా 6,006 క్యూసెక్కులు, ఎస్ఎల్బీబీ ద్వారా 900 క్యూసెక్కలు కలిపి 6,906 క్యూసెక్కుల అవుట్ ఫ్లో కొనసాగుతున్నది.
నారు పోసే సమయం
గత వానకాలం, యాసంగిలో ఎడమకాల్వ కింద సాగునీటి విడుదల లేకపోవడంతో రైతులు ఈ వానకాలం సాగుకు నీరు వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నారు. అందుకు అనుగుణంగా కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో ఎగువన ఉన్న ప్రాజెక్టులన్నీ నిండి నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతున్నది. ఇక వానకాలం సాగుకు రంది లేదని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో ఎడమకాల్వ కింద 2,81,683 ఎకరాలు ఉండగా 42 ఎత్తిపోతల పథకాల కింద 86,641 ఎకరాల ఆయకట్టు ఉంది. మొత్తం 3,68,324 ఎకరాల ఆయకట్టు ఉంది. వరద ప్రవాహం ఇదేవిధంగా కొనసాగితే మరో వారం రోజుల్లో సాగర్ ప్రాజెక్టు పూర్తిగా నిండుతుందని అధికారులు పేర్కొంటున్నారు. వానకాలం నాట్లు వేసే సీజన్ ఆగస్టు నెల మొత్తం ఉండడంతో వరినాట్లు వేసేందుకు రైతులు సన్నద్ధం అవుతున్నారు.
ఆయకట్టు కింద సాగు చేసుకునేందుకు నారుమడులు పోయాల్సి ఉందని, నారుమడులు పెంచడం కోసం వెంటనే నీటిని విడుదల చేయాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. ప్రస్తుతం నార్లు పోసుకునే సమయమని, ఈ వారంలో నీరు వదిలితే ఆగస్టు నెలలో నార్లు వేసుకోవచ్చని రైతులు భావిస్తున్నారు. రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఎడమ కాల్వకు వెంటనే నీటిని విడుదల చేయాలని ఆయకట్టు రైతులు డిమాండ్ చేస్తున్నారు.
నీళ్లు వదిలితే నారు పోసుకుంటాం…
సాగర్ ప్రాజెక్టుకు వరద నీరు పుష్కలంగా వస్తున్నందున ఎడమ కాల్వ ఆయకట్టుకు ప్రభుత్వం నీటి విడుదల షెడ్యూల్‌ను ప్రకటించాలి. నార్లు పోసుకొని వానకాలం సాగుకు సిద్ధం అవుతాం. గతేడాది వానకాలం, యాసంగిలో వరిసాగుకు ఎడమకాల్వ ద్వారా నీటిని వదలకపోవడంతో చాలా ఇబ్బంది పడ్డాం. నీళ్లు అందక పొలాలు ఎండిపోయినయి.
-గుగులోతు స్వామి, రైతు, జిలకరకుంట తండా, అడవిదేవుపల్లి మండలం
వెంటనే సాగర్ నీటిని వదలాలి
వరుణుడు కరుణించడం వల్ల మంచి సమయానికే నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద నీరు వచ్చి చేరుతున్నది. ఈ వారం రోజుల్లో వరినార్లు పోసుకొని నాటు వేసుకునేందుకు దుక్కులు సిద్ధం చేసుకుంటాం. ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో వరినాట్లు వేసుకుంటే పంటల దిగుబడి కూడా అధికంగా వస్తుంది. సాగర్ ప్రాజెక్టుకు వరద భారీగా వస్తున్నందున ప్రభుత్వం వెంటనే ఎడమకాల్వకు నీటిని విడుదల చేయాలి.
-ధీరావత్ మేష్యానాయక్, రైతు, నర్సాపురం, దామరచర్ల మండలం
ఏఎమ్మార్పీ ద్వారా చెరువులు నింపాలి
ఏంఎంఆర్పీ కాల్వల ద్వారా కనగల్ మండల పరిధిలో ఉన్న చెరువులను నింపాలి. మండలంలో అధిక శాతం వ్యవసాయం చెరువులు బోర్ల ద్వారా సేద్యం చేస్తున్నారు. గత యాసంగి నుంచి చెరువుల్లో నీళ్లు లేక పోవడంతో బోర్లు అడుగంటి పెద్ద మొత్తంలో పొలాలు ఎండి పోయినయి. రైతులు అప్పుల పాలయ్యారు. ఏఎంఆర్పీ ద్వారా చెరువులు నింపితే బోర్లకు ఇబ్బంది ఉండదు. శీశైలం ద్వారా సాగర్‌కు నీరు వస్తుంనందున ప్రభుత్వం కాల్వలకు నీటిని విడుదల చేయాలి.
-మాజీ ఎంపీపీ కరీంపాషా, కనగల్