నీలగిరి, మే 11:ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం నల్లగొండ కలెక్టరేట్‌ను ముట్టడించారు. మాజీ శాసనసభ్యుడు చిరుమర్తి లింగయ్య పిలుపు మేరకు నియోజకవర్గంలోని రైతులు గులాబీ జెండాలు చేతబూని, మెడలో ఆకుపచ్చ కండువాలు ధరించి కదం తొక్కారు. ట్రాక్టర్లు, లారీలు, ఆటోల్లో, ద్విచక్ర వాహనాలపై నియోజకవర్గంలోని ఐదు మండలాల నుంచే కాకుండా జిల్లా వ్యాప్తం గా రైతులు పెద్ద ఎత్తున కలెక్టరేట్‌కు తరలివచ్చారు. కలెక్టరేట్ సమీపంలో వాహనాలను నిలిపి ర్యాలీగా కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు.
ఈ సందర్భంగా వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కలెక్టరేట్ గేటు వద్దకు వచ్చి లోనికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ రైతులు పెద్ద సంఖ్యలో ఉండటంతో పోలీసులు వారిని అడ్డుకోలేకపోయారు. ఈ క్రమంలో వారి మధ్య స్వల్ప తోపులాట జరగడంతో ఒక్కసారిగా వాతావరణం ఉద్రిక్తంగా మారింది. రైతులు, మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, బండా నరేందర్‌రెడ్డి అధ్వర్యంలో కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లి ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించారు. రైతులను ఆదుకోవాలని, ధాన్యంలో తరు గు, తాలు పేరుతో రైతులను ఆగం చెయ్యవద్దంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
కలెక్టర్ బయటకు రావాలని రైతుల గోడు వినాలని నినాదాలు చేశారు. సుమారు గం టపాటు ప్రధాన ద్వారం ఎదుట అందోళన చేశారు. రైతుల ఆందోళనతో కలెక్టర్..అదనపు కలెక్టర్ శ్రీనివాస్ నేతృత్వంలో గ్రీవెన్స్లోని సంబంధిత అధికారులను అం దోళన చేస్తున బీఆర్ఎస్ శ్రేణుల వద్దకు పంపించారు. ధాన్యం కొనుగోళ్లలో రైతులకు జరుగుతున్న అన్యాయం పై వెంటనే చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన జేసీ 15 రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తామని, ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో వారు ఆందోళన విమరించారు. అనంతరం చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ జిల్లాలో అన్నదాతలు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తెచ్చి నెల రోజలు గడుస్తున్నా కొనుగోలు చేయకుండా అధికారులు నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారని ధ్వజమెత్తారు.
మార్కెట్ యా ర్డుల్లో కాంగ్రెస్ నాయకులు, వారి అనుచరులు పెత్తనం చెలాయిస్తూ రైతులను ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు. కొందరు మధ్యవర్తులు, అధికారులతో కుమ్మకై రైతులను మోసగిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయన్నారు. మారెట్ యార్డుల్లో రాజకీయ జోక్యాన్ని అరికట్టి, దళారుల దందాపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నను ఇబ్బం ది పెట్టకుండా ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే పెద్ద సంఖ్యలో రైతాంగాన్ని సమీకరించి ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తామని హెచ్చరించారు. జడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ రైతులు తెచ్చిన వడ్లలో తేమ, నాణ్యత పేరుతో అనవసర కోతలు విధిస్తున్నారని, దళారులు రైతులను భయపెట్టి తకువ ధరకు ధాన్యం కొనుగోలు చేసి అధికంగా డబ్బులు దండుకుంటున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ దూదిమెట్ల సత్తయ్య, పలువురు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.