నీలగిరి, మే 23 : ప్రత్యామ్నాయ పంటల సాగు, ప్రకృతి వ్యవసాయం వైపు రైతులను ప్రోత్సహించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. వరి, పత్తి వంటి సంప్రదాయ పంటలే కాకుండా కూరగాయలు, పండ్ల తోటలు, వాణిజ్య పంటల సాగు, అలాగే ప్రకృతి వ్యవసాయం చేసేలా రైతులకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు, అభ్యుదయ రైతులు, వ్యవసాయ అధికారులతో రానున్న వానాకాలం వ్యవసాయ సాగు సింసిద్ధతపై అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సుకు హాజరైన కలెక్టర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులు క్రమం తప్పకుండా పండించే వరి, పత్తి వంటి పంటల వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రత్యేకంగా వరిలో శ్రమ ఎక్కువ, ఆదాయం తక్కువగా ఉండడం, పంట అమ్మకాల్లో నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం, ఆకాల వర్షాల వంటి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని జిల్లా రైతులను ప్రత్యామ్నాయపంటల వైపు మళ్లించాలన్నారు.
ముఖ్యంగా కంది, కూరగాయలు, పండ్ల తోటలు, అధిక ఆదాయం ఇచ్చే వాణిజ్య పంటల వైపు వారిని ప్రోత్సహించాలన్నారు. వీటితో పాటు ప్రకృతి వ్యవసాయంపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించేలా రైతులకు అవగాహన కల్పించాలని, రైతు ఉత్పత్తి సంస్థల ఏర్పాటు, మరింత మంది అభ్యుదయ రైతులను తయారు చేయడంపై దృష్టి సారించాలన్నారు. ఉద్యాన పంటలు, నూతన వంగడాల సాగుకు సంబందించి ప్రతి రెండు మండలాలను కలిపి క్లస్టర్‌గా ఏర్పాటు చేసి మార్కెటింగ్‌కు ప్రోత్సాహం కల్పించేలా నెలలోపు ప్రతిపాదనలు సమర్పించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ఉద్యాన పంటల సాగు, ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు ప్రభుత్వం నుంచి సబ్సిడీ డ్రిప్ వంటి సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు.
నల్లగొండ మాజీ శాసనసభ్యుడు, కట్టంగూర్ రైతు ఉత్పాదక సంస్థ వ్యవస్థాపకుడు నంద్యాల నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయ రంగంలో ఆద్భుతమైన ఫలితాలు సాధించేందుకు రైతులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు, ప్రభుత్వం సమగ్రమైన అలోచనతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. వివిధ రకాల పంటల సాగు, ప్రకృతి వ్యవసాయంలో అద్భుతాలు సాధిస్తున్న అభ్యుదయ రైతులు మరికొంత మంది అభ్యుదయ రైతులను తయారు చేయాలని, రైతుల్లో వ్యాపార దృక్పథం పెరగాల్సిన అవసరం ఉందన్నారు. రైతులు పండించిన పంటలకు పటిష్ట మార్కెట్ వ్యవస్థ ఉండాలని, మధ్య దళారీ వ్యవస్థ తగ్గాలన్నారు. వ్యవసాయలో ఉత్పాదక పెరిగి పెట్టుబడి తగ్గేలా చూడాలన్నారు. ప్రతి పంటకు మార్కేటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయడమే కాకుండా సూక్ష్మ పరిశ్రమలు, ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయడం వల్ల రైతులు పండించిన పంటలకు విలువ ఆధారిత సౌకర్యం కలుగుతుందన్నారు.
గడిచిన పది సంవత్సరాల్లో నీటి పారుదల సౌకర్యాలు పెరిగినందున రైతులు వరివైపు కాకుండా ఇతర ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలన్నారు. చందంపేట అభ్యుదయ రైతు పద్మారెడ్డి, ప్రకృతి వ్యవసాయ జిల్లా స్థాయి కమిటీ సభ్యుడు అంజిరెడ్డి, ప్రకృతి వ్యవసాయ రైతు జక్కుల వెంకటేశ్, సేంద్రీయ వ్యవసాయ రైతు నవీన్‌రెడ్డి, కోట్టం సత్తిరెడ్డి, శ్రీనివాసరావు, మందడి గోపాల్‌రెడ్డి, పల్లె జగన్, కనగల్ రాంరెడ్డి, బొడ్డు ఈదయ్య, పెద్దవూర పాత ఎల్లయ్య, ఐలాపురం వెంకన్న నూతన పద్ధతిలో పండిస్తున్న ఉద్యాన, కూరగాయల సాగు, పామాయిల్ తోటల పెంపకం, ప్రకృతి వ్యవసాయం, లాభాలు, దిగుబడుల గురించి వివరించారు. అనంతరం కూరగాయల సాగు, పామాయిల్ పెంపకంపై రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన కరపత్రం, బుక్లెట్లను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సదస్సులో జిల్లా వ్యవసాయ అధికారి శ్రావణ్, ఉద్యాననవ శాఖ అధికారి అనంతరెడ్డి పాల్గొన్నారు.
Nalgonda : ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు రైతులను ప్రోత్సహించాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి