మునుగోడు రూరల్, సెప్టెంబర్ 25 : మునుగోడు మండలంలోని ఇప్పర్తి, కిష్టాపురం గ్రామాల మధ్యన నిర్మిస్తున్న చెక్ డ్యామ్ ఎత్తు పెంచాలని కోరుతూ గురువారం ఆ గ్రామాల రైతులు, పలు పార్టీల నాయకులు ధర్నా చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం నీటి పారుదల శాఖ ద్వారా రూ.4 కోట్లకు పైగా నిధులు కేటాయించి భూగర్భ జలాలు పెంచేందుకు ఉపయోగపడేలా నిర్మాణం ఉండాలని, వర్షపు నీటిని నిల్వ ఉంచే విధంగా పనులు ఉండాలే తప్పా కనీసం నీళ్లు నిలబడలేని స్థితిలో నిర్మాణం ఉందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
చెక్ డ్యామ్ ఎత్తు పెంచి, ప్రతి వర్షపు నీటి చుక్కను ఒడిసిపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు ఉపయోగపడేలా చెక్ డ్యామ్ పనులు చేపట్టాలని పేర్కొన్నారు. ఈ ధర్నాలో దోటి సైదులు, పులకరం సైదులు, బూడిద నరసింహ, బూడిద వెంకటయ్య, ఆడపు రవి, దోటి వెంకటేష్, స్వామి, ఉడుగుగుండ్ల సైదులు, యాదయ్య, మల్లయ్య, శంకర్ పాల్గొన్నారు.