తుంగతుర్తి, సెప్టెంబరు 24 : తుంగతుర్తిలోని పీఏసీఎస్ వద్ద బుధవారం రైతులు యూరి యా కోసం బారులు తీరారు. పలువురు రైతులు మాట్లాడుతూ రోజులు తరబడి కుటుంబంతో సహా యూరియా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నా యూరియా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి వ్యవసాయం చేయాలంటనే భయమేస్తోందని ఎరువులు అందించలేని ఇటువంటి ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదని అన్నదాలు మండిపడుతున్నారు.
పోలీసు పహారాలో యూరియా పంపిణీ..
చందంపేట, సెప్టెంబర్ 24 : చందంపేట మండలం పోలేపల్లి ఆగ్రోస్ కార్యాలయం వద్ద యూరియా వస్తోందన్న సమాచారంతో రైతులు ఒక్కసారిగా అక్కడికి చేరుకున్నారు. దీంతో అక్కడ గందరగోళం నెలకొంది. దీంతో పోలీసులు జోక్యం చేసుకొని రైతులకు నచ్చజెప్పి క్యూలైన్ ఏర్పాటు చేశారు. అయితే టోకెన్లు ఇచ్చినా యూరియా ఇవ్వలేదని కొందరు.. టోకెన్లు ఇవ్వడంలేదని మరికొందరు వాపోయారు.
బస్తా కోసం బజారులో పండుకుంటున్నాం..
త్రిపురారం, సెప్టెంబర్ 24: బస్తా యూరియా కోసం బజార్లలో పడుకుంటున్నామని, చలి, దోమలతో జ్వరాలు, జబ్బులు వస్తున్నాయని, త్రిపురారం రైతులు వాపోతున్నారు. యూరియా కోసం మంగళవారం రాత్రే మండల కేం ద్రంలోని రైతు వేదిక సుమారు 50 మంది రైతులు నిద్రపోయారు. రోజుకు ఒకే కట్ట యూరియా ఇవ్వడం, అది కూడా అందరికీ ఇవ్వకపోవడంతో నానా అవస్థలు పడుతున్నామని ఇకనైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి రైతులకు యూరి యా అందించాలని కోరుతున్నారు.
వారం రోజులుగా యూరియా రాలే..
పెన్‌పహాడ్, సెప్టెంబర్ 24 : మండల పరిధిలోని నారాయణగూడెం పరిధిలోని అనంతారం గ్రామ సహకార సంఘం కార్యాలయం వద్దకు వారం రోజులుగా యూరియా రాలేదు. కాగా బుధవారం ఒక లోడు వచ్చిందనే సమాచారం అందుకున్న రైతులు సహకార సంఘం వద్దకు పరుగులు తీశారు. పొద్దుగాల లేచింది మొదలు యూరియా ఎప్పుడోస్తదో..అని ఎదురు చూడటం.. తిండీ తిప్పలు మాని కుటుంబాలతో సహా సొసైటీల ఎదుట పడిగాపులు పడటం నిత్యకృత్యంగా మారిం దని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
30 బస్తాలకు వంద మంది రైతులు
అర్వపల్లి, సెప్టెంబరు 24 : ఉన్నవి 30 యూరియా బస్తాలు వచ్చిన రైతులు వంద మందికి పైగా.. ఇది బుధవారం అర్వపల్లి పీఏసీఎస్ వద్ద నెలకొన్న పరిస్థితి.. రైతులు తెల్లవారుజాము నుండే వచ్చి క్యూలైన్లో వేచి ఉన్నారు. అయితే కేంద్రంలో కొద్దిపాటి యూరియా ఉండటం, ఎక్కువ మంది రైతులు రావడం తో మధ్యాహ్నం అధికారులు యూరియా అందరికీ సరిపోదని మరుసటి రోజు రావాలని చెప్పడంతో పీఏసీఎస్ సిబ్బందిని రైతులు నిలదీశారు. ఇంకా ఎన్ని రోజులు తిరగాలంటూ ఆవేదనతో ఇంటి ముఖం పట్టారు.
టోకెన్లు పట్టుకొని తిరుగుతున్న రైతులు
నూతనకల్, సెప్టెంబరు 24 : మండల కేంద్రంలోని పీఏసీఎస్ కేంద్రం వద్దకు నెల రోజులుగా యూరియా కోసం రైతులు తిరుగుతూనే ఉన్నారు. టోకెన్ కోసం ఒకరోజు.. బస్తా కోసం మరో రోజు క్యూలో నిలబడి ఓపిక ఉన్న రైతులు యూరియా బస్తా సంపాదిస్తున్నారు. కానీ మహిళలు, వృద్ధ రైతులకు నిరాశే మిగులుతోంది. మూడు రోజుల క్రితం టోకెన్లు సంపాదించినా యూరియా అందక అనేకమంది ఇబ్బందులు పడుతున్నారు. సొసైటీలో యూరియా ఉన్నప్పటికీ అధికారులు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు టోకెన్లు చేత్తో పట్టుకుని రెండు రోజులుగా అటు ఇటు తిరుగుతున్నా బస్తా కూడా ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు.
క్యూలో ఆధార్ కార్డులు పెట్టి..
నాగారం, సెప్టెంబర 24 : నాగారం మండల పరిధిలోని ఎక్స్‌రోడ్ వద్ద ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్ద బుధవారం యూరి యా రావడంతో పలు గ్రామాలకు చెందిన వందలాది రైతులు రాత్రి సమయంలో ఆధార్ కార్డులను క్యూలో పెట్టారు. తెల్లవారుజామున లేచి యూరియా కోసం ఎదురు చూస్తూ క్యూలో నిలుచున్నారు. క్యూలో నిలుచున్న వారికి ఒక్కొక్కరికీ రెండు బస్తాల చొప్పున యూరియా అందించారు. అయినప్పటికీ మిగ తా రైతులకు దొరక్కపోవడంతో పలువురు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.