అర్వపల్లి, నవంబర్ 06 : రైతులకు పంట వేసినప్పటి మొదలు చేతికొచ్చే వరకు కష్టాలు తప్పడం లేదు. మొన్నటి వరకు యూరియా దొరకక రాత్రి, పగలనక పిఎసిఎస్ కేంద్రాల వద్ద నిద్రించి చెప్పులను, ఆధార్ కార్డులను క్యూలైన్లో పెట్టి రోజుల తరబడి నిలబడ్డా బస్తా యూరియా దొరకని పరిస్థితి. ఎలాగోలా సాగుచేసి చివరికి పంట చేతికొచ్చి అమ్ముదామనుకుంటే అకాల వర్షంతో వరి నేలకొరిగింది. ఇప్పుడు కొనుగోలు కేంద్రాల్లో సరైన వసతులు లేకపోవడంతో ధాన్యపు రాశులు కుప్పలు కుప్పలుగా నిల్వ ఉండి వర్షానికి తడుస్తూ రంగుమారి మొలకెత్తుతున్నాయి. దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు పడ్డారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ తడిసిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని, లేదంటే తమకు చావే శరణంమంటూ గురువారం అర్వపల్లి మండలంలోని కుంచమర్తి గ్రామానికి చెందిన రైతులు రోడ్డెక్కారు.
జనగామ- సూర్యాపేట జాతీయ రహదారిపై అడివెంల క్రాస్ రోడ్డు వద్ద ట్రాక్టర్లను రోడ్డుకు అడ్డంగా పెట్టి గంటసేపు ధర్నాకు దిగారు. దీంతో ఇరువైపులా భారీగా వాహనాలు రోడ్డుపై నిలిచిపోయాయి. కొనుగోలు కేంద్రం ప్రారంభమై నెల రోజులు కావస్తున్నా కాంటాలు త్వరగా వేయకపోవడంతో ధాన్యం మొలకెత్తుతుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రైస్ మిల్లులో క్వింటాకు 5 కిలోల ధాన్యాన్ని కోత విధిస్తున్నారని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి తడిసిన ధాన్యం, రంగు మారినా, తేమ శాతంతో సంబంధం లేకుండా మొలకెత్తిన ధాన్యాన్ని కొనడంతో పాటు త్వరగా కాంటాలు వేయాలని రైతులు వేడుకుంటున్నారు. అధికారులు వచ్చి నచ్చజెప్పడంతో ధర్నాను విరమించారు.

Arvapally : ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని రైతుల ధర్నా