అర్వపల్లి, నవంబర్ 6: రైతులకు పంట వేసినప్పటి నుంచి మొ దలు చేతికొచ్చే వరకు కష్టాలు తప్పడం లేదు. మొన్నటి వరకు యూరియా దొరక్క పగలు, రాత్రనక పీఏసీఎస్ కేంద్రాల వద్ద నిద్రించి చెప్పులు, ఆధార్ కార్డులు క్యూలో పెట్టి గంటలకొద్దీ నిలబడి బస్తా యూ రియా కోసం నానాఅవస్థలు పడ్డారు. చివరికి పంట చేతికొచ్చి అమ్ముదామనుకుంటే అకాల వర్షంతో పంట నేలకొరిగింది. ఇప్పుడు కొనుగోలు కేంద్రాల్లో సరైన వసతుల్లేకపోవడంతో కు ప్పులు కుప్పలుగా నిల్వ ఉన్న ధాన్యపు రాశులు వర్షానికి తడిసి రంగుమారి మొలకెత్తుతున్నాయి.
దీంతో అన్నదాతలకు దిక్కుతోచకపోవడంతో తడిసిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని, లేదంటే చావే గతి అంటూ గురువారం మండలంలోని కుంచమర్తి గ్రామానికి చెందిన రైతులు రోడ్డెక్కారు. జనగాం- సూర్యాపేట జాతీయ రహదారిపై ఉన్న ఆడివెంల క్రాస్ రోడ్డు వద్ద రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్లు పెట్టి గంట సేపు ధర్నాకు దిగారు. దీంతో ఇరువైపులా భారీ సంఖ్యలో వాహనాలు హైవేపై నిలిచిపోయాయి. కొనుగోలు కేంద్రం ప్రారంభమై నెలరోజులు కావొస్తున్నా కాంటాలు త్వరగా వేయకపోవడంతో ధాన్యం మొలకెత్తుతోందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభు త్వం స్పందించి తడిసి రంగు మారిన, మొలకెత్తిన ధాన్యాన్ని తేమ శాతంతో సంబంధం లేకుండా కొనుగోలు చేసి త్వరగా కాంటాలు వేయాలని రైతులు వేడుకుంటున్నారు. అధికారులు వచ్చి నచ్చజెప్పడంతో ధర్నా విరమించారు.