సూర్యాపేట రూరల్, మే 6 : ఐకేపీ కేంద్రంలో వడ్లు కొనకుండా నెల రోజులుగా అధికారులు, నిర్వాహకులు నిర్లక్ష్యం చేయడంతో రైతులు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవా రం మండల పరిధిలోని బాలెంల ధాన్యం కొనుగోలు కేంద్రంలో నెల రోజులుగా కొనుగోళ్లు నిలిచిపోవడంతో సూర్యాపేట-జనగాం రహదారిపై రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సం దర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. నెల రోజులుగా ధాన్యం కొనుగోలు చేపట్టకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు.
మిల్లర్లు సిండికేట్‌గా ఏర్పడి క్వింటాల్‌కు 6 నుంచి 7 కిలోల వరకు తరుగు తగ్గిస్తున్నారని, దీని వల్ల ఆర్థికంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు లేకపొవడంతో రైతులు సొంతంగా పట్టాలు తెచ్చుకొని ధాన్యాన్ని కాపాడుకునే పరిస్థితి వచ్చిందన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే కేంద్రాల్లో ఉన్న ధాన్యం మొలకెత్తి పూర్తిగా నష్టపొయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కలెక్టర్ స్పందించి ధాన్యం కొనుగోలు చేసి, తరలించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ధర్నా కార్యక్రమంలో పలువురు రైతులు పాల్గొన్నారు.