నల్లగొండ, జనవరి 18 : రైతులను నిర్లక్ష్యం చేస్తున్న రేవంత్ సర్కారుకు రైతాంగం కష్టాలను కండ్లకు కట్టేందుకు ఈ నెల 21న నల్లగొండ జిల్లా కేంద్రంలో రైతు మహాధర్నా నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్, బడుగుల లింగయ్యయాదవ్, కంచర్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. రైతుల పక్షాన పోరాటానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వస్తున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ, రైతుభరోసా, రైతు భీమా అందని రైతులంతా పార్టీలకు అతీతంగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన రైతులతో మంగళవారం క్లాక్‌టవర్ సెంటర్లో పెద్దఎత్తున నిరసన తెలుపనున్నట్లు చెప్పారు. నల్లగొండ జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో వాళ్లు మాట్లాడారు. మొదట నల్లగొండ జిల్లా అధ్యక్షుడు రవీంద్రకుమార్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన ఈ ఏడాది కాలంలో రైతు భరోసా పేరుతో ఎకరాకు రూ.15వేలు ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కోత పెట్టడం దుర్మార్గమన్నారు.
ఎకరాకు రూ.7500 చొప్పున ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న మొత్తం ఎకరాకు రూ.17,500 ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సర్కారును నిలదీసేందుకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బాధిత రైతులు తరలిరావాలని పిలుపునిచ్చారు. గత యాసంగి రైతు భరోసా ఎగ్గొట్టిన రేవంత్ సర్కార్ సన్నధాన్యానికి బోనస్ కూడా ఇవ్వలేదని విమర్శించారు. 24 గంటల విద్యుత్ అందడం లేదని, మార్కెట్లో యూరియా కొరత ఉందని పేర్కొన్నారు. కేసీఆర్ పదేండ్లల్లో రైతును రాజు చేయడానికి రైతు బంధు, రైతు భీమా, రుణమాఫీ, 24 గంటల ఉచిత కరెంట్, చివరి గింజ వరకూ ధాన్యం కొనుగోళ్లు వంటివి చేపట్టి అండగా నిలిస్తే.. రేవంత్ ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే వ్యవసాయ రంగాన్ని నాశనం చేసి అన్నదాతను కుదేలు చేసిందని మండిపడ్డారు.
రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం ; బడుగుల లింగయ్యయాదవ్, బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు
బీఆర్ఎస్ పార్టీకి అధికారం ప్రధానం కాదని పేదల పక్షంగా పని చేస్తుందని సూర్యాపేట బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ స్పష్టం చేశారు. పదేండ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ పేదల పక్షంగానే పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేయటడంతోపాటు రైతు సంక్షేమం కోసం ఎంతో కృషి చేశారని గుర్తుచేశారు. ఇవ్వాల అధికారంలో ఉన్న రేవంత్ సర్కార్ రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేస్తున్నందునే ప్రధాన పక్షంగా ఉన్న బీఆర్ఎస్ పోరాటం చేస్తున్నదన్నారు. రైతులతోపాటు అన్ని వర్గాలను మభ్య పెట్టి మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏ ఒక్కటీ అమలు చేయలేదన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు విశ్రమించకుండా పోరాడుతామన్నారు. రైతు మహాధర్నాకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి హాజరవుతున్న నేపథ్యంలో రైతులంతా స్వచ్ఛందంగా రావాలని కోరారు.
బాధిత రైతులంతా మహాధర్నాకు రావాలి
కాంగ్రెస్ సర్కారులో రైతు భరోసా, రైతుభీమా రానివారు, రుణమాఫీ కానివారు, 24 గంటల కరెంట్ అందని వారంతా బాధితులేనని, వారంతా స్వచ్ఛందంగా మహాధర్నాకు రావాలని బీఆర్ఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఇది రాజకీయ సభ కాదని, మన బాధ చెప్పడానికి నిర్వహిస్తున్న సభ అని తెలిపారు. రైతులు పెద్ద సంఖ్యలో హాజరైతే కష్టాలను రేవంత్ సర్కారు కండ్లకు కట్టాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలనపై దృష్టి పెట్టకుండా అరాచకానికి పాల్పడుతున్నదని, అందులో భాగంగానే ఇటీవల భువనగిరిలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ధ్వంసం చేసిందని తెలిపారు. ప్రతిపక్షం అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పాలే తప్ప దాడులు సరికాదన్నారు.
పోలీస్, అధికార యంత్రాంగం కాంగ్రెస్ పార్టీకి కొమ్ము కాయకుండా చిత్తశుద్ధితో విదులు నిర్వహించాలని సూచించారు. సమావేశంలో ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, నల్లగొండ జడ్పీ మాజీ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, కంచర్ల భూపాల్‌రెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్, బీఆర్ఎస్ నాయకులు కంచర్ల క్రిష్ణారెడ్డి, నిరంజన్‌వలీ, కటికం సత్తయ్య గౌడ్, తండు సైదులుగౌడ్, రేగట్టె మల్లికార్జున్ రెడ్డి, మందడి సైదిరెడ్డి, అభిమన్యు శ్రీనివాస్, రావుల శ్రీనివాస్‌రెడ్డి, కొండూరు సత్యనారాయణ, మారగోని గణేశ్‌గౌడ్, జమాల్ ఖాద్రి, కందుల లక్ష్మయ్య, దేప వెంకట్‌రెడ్డి, ఐతగోని యాదయ్య, లొడంగి గోవర్ధన్, మైనం శ్రీను పాల్గొన్నారు.