సూర్యాపేట, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): సూర్యాపేట జిల్లాలో వరి ధాన్యం పండించిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం కొనుగోళ్లు చేస్తామం టూ ఆర్భాటంగా ప్రకటనలు చేసి కేంద్రాలను తెరిచిందే తప్ప కొనుగోళ్ల సంగతి మరిచిపోయింది. గత పదిహేను రోజులుగా వరి కోతలు జోరుగా సాగుతున్నా యి. ఇప్పటి వరకు దాదాపు 50 శాతం కోతలు పూర్తయినట్లు వ్యవసాయశాఖ అంచనాలు వేస్తున్నది. కానీ ప్రభుత్వ పరంగా కొనుగోలు చేసింది జీరో. సన్నాలకు ఐదొందలు బోనస్ ఇస్తాం.. మొత్తం కొనుగోలు చేస్తామని బీరాలు పలికిన ప్రభుత్వం ఆచరణలో మాత్రం శూన్య హస్తం చూపిస్తోంది. దీంతో రైతులు తమ ధాన్యాన్ని మిల్లర్లకు, దళారులకు విక్రయిస్తూ నిలువు దోపిడీకి గురవుతున్నారు. మరో పక్క రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించి కొనుగోళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. అకాల వర్షాలు వస్తే తమ పరిస్థితి ఏందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్వయానా పౌరసరఫరాల శాఖ మంత్రి ఇలాకాలోనే ఇలాంటి పరిస్థితి ఉండటం దారుణం.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం లో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేయడంతో జిల్లాలో ఎడారిగా ఉన్న భూములు పచ్చని పంటపొలాలుగా మారాయి. కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లోని భూములకు నాగార్జునసాగర్ నుంచి సాగునీరు అం దుతుండగా సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాలకు కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని 2.75 లక్షల ఎకరాలకు ఎస్ఆర్ఎస్పీ ద్వారా నీరందడంతో ఆయకట్టు కళకళలాడింది. కేసీఆర్ నీళ్లు తేవడమే కాదు రైతులు పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనుగోలు చేసేందుకు గ్రామ గ్రామాన కొనుగోలు కేంద్రం ప్రారంభించి రైతులకు నయాపైసా ఖర్చు లేకుండా కొనుగోళ్లు చేసి వారి ఖాతాలో డబ్బులు జమచేశారు. కానీ గత రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులకు నీళ్లు, విద్యుత్తు, విత్తనాలు, ఎరువులు ఇలా అన్ని సమస్యలూ ఎదురవుతున్నాయి. చివరకు కష్టపడి పండించిన ధాన్యం అమ్ముకుందామంటే రెండేళ్లుగా ప్రభుత్వం ఏమాత్రం సహకారం అందివ్వడంలేదు. ధాన్యం చేతికి వచ్చే సమయానికే కొనుగోళ్లు ప్రారంభించాల్సి ఉండగా..జోరుగా కోత లు జరుగుతున్నా కొనుగోళ్లు చేయాలనే ఆలోచన అధికార యంత్రాంగానికి రాకపోవడం పట్ల రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
కొనుగోళ్లలో తాత్సారం.. బోనస్‌కు మంగళం
జిల్లాలో పదిహేను రోజులుగా దాదాపు సగం వరి కోతలు పూర్తి కాగా బుధవారం నాటికి ప్రభుత్వం కొనుగోలు చేసింది జీరో. సన్నాలకు క్వింటా ఒక్కంటికి రూ.500 బోనస్‌కు మంగళం పాడేందుకే కొనుగోళ్లలో తాత్సారం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత యాసంగి సీజన్లో సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 12.31 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో 5.60 లక్షల మెట్రిక్ టన్నులు దొడ్డు రకం కాగా, 6.70 లక్షల మెట్రిక్ టన్నులు సన్న రకం. ఈ స్థాయిలో ధాన్యం దిగుబడి అయితే ప్రభుత్వ పరంగా కొనుగోలు చేసేందుకు మాత్రం కేవలం 4 లక్షల మెట్రిక్ టన్నులు టార్గెట్‌గా పెట్టుకున్నట్లు తెలిసింది. అందులో 3 లక్షలు దొడ్డు రకం, ఒక లక్ష సన్నరకం. అంటే ఈ లెక్కన ప్రభుత్వ హామీ మేరకు సన్న వడ్లకు చెల్లించాల్సిన క్వింటా ఒక్కంటికి రూ.500లను ఎగ్గొట్టేందుకే కొనుగోళ్లను నిలిపివేశారని అర్థం చేసుకోవాలి.
జిల్లా వ్యాప్తంగా 281 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు అధికారులు అనుమతులు ఇవ్వగా 212 కేంద్రాలు తెరిచేందుకు సిద్ధంగా ఉన్నాయని సివిల్ సైప్లె అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే రైతులు కోసిన ధాన్యాన్ని కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల నుంచి మిర్యాలగూడలోని మిల్లులకు వెళ్తుండగా అక్కడ ధరలు తగ్గించి రైతులను మోసగిస్తున్నారు. దీంతో ఏ స్థాయిలో గందరగోళం జరుగుతుందో విదితమే. ఇక తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల నుంచి ప్రైవేట్ దళారులు, మిల్లులకు ధాన్యం విక్రయిస్తుండగా ప్రభుత్వ మద్దతు ధరకు వంద నుంచి 150 వరకు తక్కువ ఇస్తుండడంతో పాటు బస్తా ఒక్కింటికి రెండు కిలోలు కోత పెడుతున్నారని, అయినా గత్యంతరం లేక అమ్ముకుంటున్నామని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలని రైతులు వేడుకుంటున్నారు.
గత్యంతరం లేకనే మిల్లుకు అమ్మిన..
అర్వపల్లి, ఏప్రిల్ 8 : యాసంగి సీజన్లో నాకు 108 క్వింటాల సన్న ధాన్యం పడింది. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో గత్యంతరం లేక నకిరేకల్ లోని మిల్లులో క్వింటాకు రూ.2400కు అమ్మిన. అదే ఇప్పటికే ఐకేపీ సెంటర్‌ను ప్రారంభిస్తే నాకు క్వింటాకు 500 బోనస్ కలిసోచ్చేది. దీంతో రూ.54 వేల బోనస్ డబ్బుతో కలిపి ట్రాక్టర్ రవాణా ఖర్చులు రూ 8 వేలతో మొత్తం రూ.62వేలు నష్ట పోవాల్సివచ్చింది.. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నా మాదిరిగా రైతులు మోసపోకుండా త్వరగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి.
-కాటబత్తిని లక్ష్మీనర్సు, రైతు, బొల్లంపల్లి