పెన్పహాడ్, సెప్టెంబర్ 11 : యూరియా కోసం రైతుల కష్టాలు తీవ్రమవుతున్నాయి. బస్తా యూరియా కోసం పెన్పహాడ్ మండలం నారాయణగూడెం సహకార సంఘం పరిధిలోని అనంతారం గ్రామంలోని సొసైటీల వద్ద రైతులు రోజుల తరబడి జాగారం చేస్తున్నారు. తిండీతిప్పలు మాని పడిగాపులు కాస్తున్నారు. అయినా ఒక్క బస్తా యూరియా దొరకని పరిస్థితి నెలకొంది. యూరియా కోసం తమ పాస్ బుక్, ఆధార్ కార్డు జిరాక్స్ పత్రాలను క్యూలైన్లో రైతులు తెల్లవారుజామునే ఉంచారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు క్యూలో ఉన్నారు.
శనివారం నాడు జిరాక్స్ లు సీరియల్ పెట్టిన వారికి మాత్రమే యూరియా ఇస్తాం అని సొసైటీ సిబ్బంది అనడంతో, పలువురు రైతులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. యూరియా కోసం రైతుకు ఒక టోకెన్ ఇచ్చి, ఒక్క యూరియా బస్తా అందించారు. ఒక్క యూరియా బస్తా సరిపోదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం, అధికారుల తీరుపై మండిపడ్డారు.