నల్లగొండ సిటీ, నవంబర్ 3 : ఆకాల వర్షం రైతులను ముంచుతున్నది. శనివారం అర్ధరాత్రి, ఆదివారం ఉదయం కురిసిన వాన రైతన్నను ఆగం చేసింది. ధాన్యం కేంద్రాల్లో కొనుగోళ్లు ప్రారంభంకాకపోవడంతో తెచ్చిన ధాన్యం తడిసిపోయింది. పలుచోట్ల వడ్లు కొట్టుకుపోగా అన్నదాతలకు దుఃఖమే మిగిలింది. కనగల్ మండలంలోని కనగల్, జీ యడవల్లి, రామచంద్రాపురం, కురంపల్లి, అమ్మగూడెం గ్రామాల్లో ఆకాల వర్షానికి ఆపార నష్టం జరిగింది. అమ్మకానికి తీసుకొచ్చిన ధాన్యం తడిసి ముద్దయ్యింది. దీంతో ఆరుగాలం తాము పడ్డ కష్టమంతా నీళ్లపాలైందని అన్నదాతలు కన్నీరుపెట్టారు. అధికారులు సకాలంలో తూకాలు వేసినట్లయితే ధాన్యం తడిసేది కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తేమ శాతం రాలేదనే సాకుతో అధికారులు ధాన్యం కొనుగోళ్లను ఆలస్యం చేయడంతోనే ధాన్యం వర్షానికి కొట్టుకు పోయిందని రైతులు అంటున్నారు. కొట్టుకుపోయిన ధాన్యానికి నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.
కేతేపల్లి : మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో ఆదివారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి కోత దశకు వచ్చిన వరి పొలాలు నేలవాలాయి. కేంద్రాల్లో పోసిన ధాన్యం రాశులు తడిసి ముద్దయ్యాయి. ధాన్యం తడవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం పూట పట్టాలు వేసి ధాన్యాన్ని ఆరబెట్టే ప్రయత్నం చేశారు. అలాగే వర్షానికి ఏరేందుకు సిద్ధంగా ఉన్న పత్తి చేలపై తడిసింది.
హుజూర్నగర్ రూరల్ : అకాల వర్షంతో హుజూర్నగర్ మండలం అమరవరంలో 60ఎకరాలకు పైగా వరి పంట నేలవాలింది. పంట చేతికి వచ్చే దశలో వర్షం నిండా ముంచిందని, తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
గుర్రంపోడ్ : మండలంలో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఐకేపీ కేంద్రాల్లో 200 క్వింటాళ్ల ధాన్యం తడిసిందని మండల వ్యవసాయాధికారి కంచర్ల మాధవరెడ్డి తెలిపారు. తడిసిన ధాన్యాన్ని రైతులు ఆరబెట్టాలని, ఆరబెట్టిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పారు. మండలంలోని చామలేడు, కొయగూరోని బావి ఐకేపీ కేంద్రాల్లో 8 మంది రైతులకు చెందిన ధాన్యం తడిసిందని తెలిపారు.
తిప్పర్తి : మండలంలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం శనివారం అర్థరాత్రి కురిసిన వర్షానికి తడిసి ముద్దయ్యింది. దాంతో రైతన్నలు ధాన్యం ఆరబెట్టలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులు తేమ శాతం పేరుతో వడ్లు కాంటాలు పెట్టక నిర్లక్ష్యం వహించడంతోనే ఈ కష్టం వచ్చిందని రైతులు చెబుతున్నారు. వర్షంలో ధాన్యం కొట్టుకుపోగా వాటిని ఎత్తుకోవడంతోపాటు వర్షపు నీటిని తొలగించడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొన్ని కేంద్రాలలో వడ్లు కాంటా పెట్టినప్పటికీ లారీల కొరతతో లోడ్ ఎత్తకపోవడంతో ధాన్యం గోనె సంచుల్లోనే ఉన్నాయి. మరోవైపు వరి చేలు వర్షానికి అడ్డం పడడంతో రైతన్నలు దిగులు చెందుతున్నారు.
నాకున్న నాలుగు ఎకరాల వరిని 12 రోజుల కిందట కోసి మాఊరు ఐకేపీ సెంటర్లో పోసిన. అప్పటి నుంచి కొంటరని ఎదురు చూస్తున్న. మొదట మా ఊరి కొనుగోలు కేంద్రం ప్రారంభిస్తే సంతోషపడ్డం. కానీ ఇప్పటివరకు కొనేటోళ్లు లేరు. ఇప్పుడేమే ఉన్న వండ్లు తడిసి ముధ్దయినయి. ఏం చేయాలో తెలుస్తలేదు. రాత్రి వర్షానికి నాతోపాటు చాలా మంది రైతుల వడ్లు కొట్టుకుపోయినయి. ప్రభుత్వం మాకు న్యాయం చేయాలె.
– దేశిడి శేఖర్, కనగల్
నాకు ఐదెకరాల పొలం ఉంది. కనగల్ ఐకేపీలో ధాన్యం పోసి 10 రోజులైంది. వడ్లు పోసిన తర్వాత నాయకులు వచ్చి అప్పుడే కొనేటట్లు చెప్పి ఐకేపీ సెంటర్ను ప్రారంభించిండ్రు. 15 రోజులైనా అతీగతి లేదు. పీడీ సారు వచ్చి వడ్లు కొనాలే అని చెప్పిండ్రు. అధికారులు గన్నీ సంచులు కూడా వేసిండ్రు. అయినా ఎవరూ కొనడం లేదు. మా సెంటర్లో ఇంత వరకు కాంటానే మొదలు కాలేదు. రోజూ ఆరబోసి కుప్ప పోస్తున్న. రాత్రి వచ్చిన వర్షానికి వడ్లు కొట్టుకు పోయినయి.
– బారి శ్రీను, కనగల్
నాకు ఏడెకరాల పొలం ఉంది. వరి కోసి పది రోజులైంది. మా ఊరు ఐకేపీ సెంటర్లో వడ్లు పోసిన. కానీ ఇప్పటికీ కొనేటోళ్లు లేరు. రాత్రి వచ్చిన వానకు వడ్ల రాశులపై నీరు చేరింది. వానొచ్చిన ప్రతి సారి ఆగమైతున్నం. ఇంత వరకు మావైపు ఏఓ గానీ ఏపీఎంగానీ రాలే. ప్రభుత్వమే మాకు జరిగిన నష్టంపై పరిహారం ఇవ్వాలి.
– పాలకూరి వెంకటేశం, కనగల్
వర్షం వరుసగా వస్తుండడంతో వడ్లు ఆరబోసుకోలేక పోతు న్నాం. అధికారులేమో తేమశాతం 17కంటే తక్కువగా ఉంటేనే కొంటాం అంటున్నరు. శనివారం కురిసిన వర్షానికి వడ్లు మొత్తం తడిసి నీటిలో కొంత కొట్టుకపోయినాయి. అధికారులు మిల్లర్లతో మాట్లాడి వడ్లు వెంటనే కొనేటట్లు చూడాలి.
– దాసరి జానయ్య, జంగారెడ్డిగూడెం, తిప్పర్తి
కాంటాలు త్వరితగతిన పెడితే కొంత నష్టం తగ్గేది. నేను వారం రోజుల కింద వడ్లు తెచ్చాను. తేమ శాతం రాలేదని ఆపారు. దీంతో వర్షం వల్ల వడ్లు పూర్తిగా తడిచాయి. వర్షం విడుతల వారీగా వస్తుంటే వడ్లు ఆరబెట్టాలంటే తీవ్ర ఇబ్బంది అవుతుంది. వెంటనే కాంటాలు పెట్టే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి.
-పాల్వాయి సంజీవరెడ్డి, రైతు తిప్పర్తి.