సూర్యాపేట, మే 13 (నమస్తే తెలంగాణ) : ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం, అధికార యంత్రాంగం రైతులను మోసం చేస్తున్నది. పండిన ధాన్యంలో సగం కూడా కొనే పరిస్థితిలో సర్కారు లేనట్లు కనిపిస్తున్నది. సూర్యాపేట జిల్లాలో 4,73,739 ఎకరాల్లో వరి సాగు చేయగా 12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. వీటిలో 4.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొంటామని తొలుత చెప్పిన అధికారులు తదనంతరం ఆ టార్గెట్ను మూడు సార్లు తగ్గించారు. చివరకు 2.70 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తామని చెబుతున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 2.18 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా వీటిలో 46,010 లక్షల మెట్రిక్ టన్నులు సన్నాలు, 1,71,731 లక్షల మెట్రిక్ టన్నులు దొడ్డు రకం ఉన్నాయి. బీఆర్ఎస్ హయాంలో రైతులు పండించిన పంటను వందకు వంద శాతం కొనుగోలు చేసి రోజుల వ్యవధిలోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కొనుగోళ్లకు ఇబ్బందులు తప్పడం లేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి అన్ని వర్గాలకు అసంతృప్తిని మిగుల్చుతున్నది. పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని వర్గాల కంటే అత్యధికంగా సంతోషంగా జీవించేలా రైతాంగానికి అన్నీ అందించగా నేడు అదే రైతన్నలు మళ్లీ గత ఉమ్మడి రాష్ట్ర దీన పరిస్థితులు దాపురిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీళ్లు రాక పంటలు ఎండితే పరిహారం లేదు, కనీసం మందలిచ్చేందుకు, ధైర్యం చెప్పేందుకు అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు చివరకు అధికారులు కూడా వెళ్లని హీన పరిస్థితికి రైతులు చేరుకున్నారు. ఇక ఈ యాసంగిలో కష్టపడి అంతోఇంతో పండించిన పంటను అమ్ముకునేందుకు దిక్కూమొక్కు లేకుండా పోయింది. జిల్లాలో దాదాపు 70శాతం పంట కోతలు పూర్తయిన తరువాత కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాగా లారీల ట్రాన్స్పోర్టు ఇబ్బందులు, తరుగు పేరుతో మిల్లుల్లో కిలో నుంచి రెండు కిలోల దోపిడీలు, ఐకేపీ కేంద్రాల నుంచి వెళ్లిన ధాన్యానికి దిగమతుల కష్టాలు, మరో పక్క కాంటాలు కాక 20 రోజుల నుంచి నెలకు పైనే ఐకేపీ కేంద్రాల్లో నిరీక్షణలు, అకాల వర్షాలతో ధాన్యం తడవడం వంటి సమస్యలతో రైతులు ఇబ్బంది పడుతున్నారు.
ప్రభుత్వ ఆదేశాలో లేక అధికారుల నిర్లక్ష్యమో జిల్లాలో కొనుగోళ్లు మాత్రం మందకొడిగా సాగుతున్నాయి. ఈ సీజన్లో ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాన్ని కుదిస్తూ రావడం ఆశ్చర్యాన్ని కల్గిస్తున్నది. తొలుత సూర్యాపేట జిల్లాలో 4.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రకటించగా తదనంతరం 4.13, ఆ తర్వాత 3.50 లక్షల మెట్రిక్ టన్నులకు తగ్గించారు. తాజాగా 2.70 లక్షల మెట్రిక్ టన్నులకు కుదించారు. ఇప్పటి వరకు 2.18 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, మరో 50 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసే అవకాశం ఉందని జిల్లా సివిల్ సప్లయ్ మేనేజర్ ప్రసాద్ తెలిపారు. వాస్తవానికి ఈ సీజన్లో జిల్లాలో 4,73,739 ఎకరాల్లో వరి సాగు చేయగా 12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండుతుందని వ్యవసాయశాఖ అంచనాలు వేసింది. వీటిలో ఇప్పటి వరకు 32,365 మంది రైతుల నుంచి 2.18 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయగా ఇందులో 46,010 మెట్రిక్ టన్నులు సన్నాలు, 1,71,731 మెట్రిక్ టన్నులు దొడ్డు రకం ఉన్నాయి. 13,691 మంది రైతులకు రూ.203 కోట్లు చెల్లించగా మరో 18,674 మంది రైతులకు రూ.301 కోట్లు చెల్లించాల్సి ఉంది. కొనుగోలు చేసిన సన్నాలకు సంబంధించి ఇప్పటి వరకు క్వింటాకు రూ.500 బోనస్ ఊసే లేదని తెలిసింది. మొత్తం మీద ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం విఫలం కావడం పట్ల రైతాంగం తీవ్ర అసహనం, ఆగ్రహంతో ఉన్నది.