బొడ్రాయిబజార్, మే 21 : కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం అన్ని రకాల ధాన్యానికి రూ.500 బోనస్ ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ ఎదుట మంగళవారం రైతులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి మేనిఫెస్టోలో చెప్పిందొకటి.. చేసేదొకటి అన్నారు. అన్ని రకాల ధాన్యానికి బోనస్ ఇస్తామని చెప్పి నేడు సన్న వడ్లకు మాత్రమే చెల్లిస్తామనడం రైతులను మోసం చేయడమేనని విమర్శించారు. సన్న రకం ధాన్యం మార్కెట్‌కు రాదని, ఎక్కువగా మిల్లర్లు కొనుగోలు చేస్తారని, మార్కెట్‌కు వచ్చేది దొడ్డు వడ్లు మాత్రమేనని అన్నారు. నేల స్వభావాన్ని బట్టి నల్ల రేగడి, చౌడు నేలల్లో ఎక్కువ శాతం రైతులు దొడ్డు ధాన్యం పండిస్తుంటారని తెలిపారు.
దొడ్డు రకాలకు బోనస్ ఇవ్వబోమనడం సరికాదన్నారు. కేసీఆర్ ఉన్నన్ని రోజులు రైతులను కంటికి రెప్పలా కాపాడుకున్నారని, కరెంట్, కాళేశ్వరం నీళ్లు, పంట మొదట్లో రైతుబంధు ఇచ్చి ఆదుకున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాళేశ్వరం నీళ్లు, సరిగా కరెంట్ ఇవ్వడం లేదన్నారు. రైతుబంధు కూడా పంట చివర్లో ఇస్తున్నాడని ఆరోపించారు. కరెంటు, నీళ్లు లేక తమ పంటలు ఎండిపోయాయని, ఉన్న కొద్ది పంట అమ్ముకునేందుకు నానా అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కోతలు లేకుండా కరెంట్, కాళేశ్వరం ద్వారా సాగునీరు, పంట మొదట్లో రైతుబంధు ఇవ్వాలని, రుణ మాఫీ చేసి రైతులను ఆదుకోవాలని ముఖ్యమంత్రిని కోరారు. అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఇస్తళాపురం, ఆత్మకూర్.ఎస్, రామన్నగూడెం, కాసరబాద, పెన్‌పహాడ్, చీదెళ్ల గ్రామాలకు చెందిన రైతులు తూడి రాములు, గునగంటి భిక్షం, జటంగి వెంకటయ్య, వెంకట్‌రెడ్డి, జూలకంటి, మల్లయ్య, సైదులు, వెంకన్న, లక్ష్మయ్య, యలమంచయ్య, మల్లయ్య, మహేందర్ పాల్గొన్నారు.
నాగారంలో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం
నాగారం : దొడ్డు ధాన్యానికి కూడా బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మండల కేంద్రంలో సూర్యాపేట – జనగాం జాతీయ రహదారిపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేశారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో రైతులు అంబయ్యగౌడ్, మల్లేశ్, సైదులు, అరుణ్, సోమిరెడ్డి, జనార్దన్, మురళి, వెంకన్న, శోభన్‌బాబు, ప్రశాంత్, పరశురాములు, నాగయ్య, వెంకన్న, వెంకటేశ్, మైసయ్య పాల్గొన్నారు.