మాడ్గులపల్లి, అక్టోబర్ 25: ఆరుగాలం శ్రమించి పండించిన పంట ను కొనుగోలు చేయకపోవడంతో ఆగ్రహించిన రైతన్నలు శనివారం మాడ్గులపల్లిలోని అద్దంకి-నార్కట్పల్లి హైవేపై రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ ఐకేపీ కొనుగోలు కేంద్రం నిర్వాహకులు ధాన్యం కొనుగోళ్లు చేపట్టడం లేదని, అధికారులు కనీసం కన్నెత్తి కూడా చూడడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఐకేపీ కొనుగోలు కేంద్రానికి ధాన్యం తరలించి దాదాపు నెల రోజులు కావొస్తున్నా పట్టించుకోకుండా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపించారు. ధర్నాతో రహదారిపై ట్రాఫిక్ జామ్ అయ్యింది. సమాచారం అందుకున్న ఎస్ఐ కృష్ణయ్య, ఏవో శివరాంకుమార్ అక్కడికి చేరుకొని రైతులకు సర్దిచెప్పి ధర్నా విరమింపజేశారు. అనంతరం మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన డీసీవో పత్యానాయక్ రికార్డులు పరిశీలించి, రైతుల ధర్నాకు గల కారణం తెలుసుకున్నారు. సెంటర్ ఇన్చార్జిని సస్పెండ్ చేయడంతో పాటు రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సీఈవోకు షోకాజ్ నోటీసులు ఇస్తామన్నారు. ఇక నుంచి ధాన్యం తరలించేందుకు లారీల కొరత లేకుండా చూడటంతో పాటు రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు.