ఈ ఏడాది రుతు పవనాలు కొంత ఆలస్యంగా వచ్చాయి. జిల్లాలో వర్షాలు వారం రోజులుగా కురుస్తున్నాయి. కానీ పంటల సాగు సమయం దాటి పోయిందని రైతులు ఆతృత పడుతున్నారు. వాస్తవంగా వివిధ రకాల పంటల సాగుకు విత్తుకోవడానికి సమయం దాటిపోలేదని.. పంటల ఎంపిక, తక్కువ కాల పరిమితి గల రకాలను ఎంచుకోవడం కీలకమని గడ్డిపల్లి కేవీకే పంటల విభాగం శాస్త్రవేత్త దొంగరి నరేశ్ తెలిపారు. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక రకాలను బట్టి వరి నారు ఈ నెల 20 నుంచి జూలై చివరి వరకు పోసుకోవచ్చని.. పత్తి, మొక్కజొన్న, కంది, వేరుశనగ, పెసర, మినుము జూలై 20-30 వరకు విత్తుకోవచ్చని చెప్పారు. మిశ్రమ పంటల సాగు లాభదాయకంగా ఉంటుందని తెలిపారు.
-గరిడేపల్లి, జూన్ 26
కేరళను ఈ నెల తాకవలసిన ఈశాన్య రుతుపవనాలు 8న తాకాయి. అయితే చాలా మంది రైతులు ఇప్పటికే పంటల సాగు సమయం దాటిపోయిందని ఆందోళన చెందుతున్నారు. వాస్తవంగా వివిధ పంటలను విత్తుకోవడానికి సమయం దాటిపోలేదు. మెట్ట పంటలను జూలై చివరి వరకు వేసుకోవచ్చని, రైతులు ఆందోళన చెందవద్దని గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం పంటల విభాగం శాస్త్రవేత్త దొంగరి నరేశ్ నమస్తే తెలంగాణకు వివరించారు. ఏ పంటను ఎప్పుడు సాగు చేసుకోవాలి. ఎలాంటి పద్ధ్దతులను అవలంబిస్తే మంచి లాభాలు పొందవచ్చో ఆయన వివరించారు. అదనపు సమాచారం కోసం 9290615952 నెంబర్లో ఆయనను సంప్రదించవచ్చు.
– గరిడేపల్లి, జూన్ 26
రుతుపవనాల రాక ఆలస్యమైనప్పుడు పంటల ఎంపిక కీలకం. ఈ సమయంలో తక్కువ కాల పరిమితి గల రకాలను ఎంచుకోవాలి. 10 – 15 శాతం ఎక్కువ విత్తనాలను వేసుకోవాలి. నీటి వినియోగం తక్కువగా ఉండే పంటలను, బెట్ట పరిస్థితులను తట్టుకునే రకాలను వేసుకోవాలి. అంతర పంటలు లేదా మిశ్రమ పంటలను సాగు చేసుకోవాలి. అంతర పంటల్లో ధాన్యం పంటలకు బదులు పప్పుదినుసులు లేదా నూనె గింజల పంటలను వేసుకోవాలి. సోయాచిక్కుడు, పత్తి పంటలను తేలికపాటి నేలల్లో వర్షాధారపు పంటలుగా విత్తుకోకూడదు. ఈ సంవత్సరం వానకాలంలో సాధారణ వర్షపాతం నమోదు కావచ్చని వాతావరణ శాఖ ప్రకటించింది. వాతావరణ సూచనలను రైతులు పాటిస్తూ పంటలను వేసుకోవాలి.
ఇతర ఆరుతడి పంటలైన ఆముదాలు, పొద్దుతిరుగుడు, ఉలవలు జూలై 31 వరకు సాగు చేసుకోవచ్చు.