చౌటుప్పల్, మే 11: చౌటుప్పల్ వ్యవసా య మార్కెట్ యార్డులోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు అరిగోస పడుతున్నారు. ధాన్యం కుప్పలు పోసి నెల రోజులు దాటినా కాంటాల సంఖ్య పెంచడం లేదు. దీంతో కొనుగోలు పక్రియ నత్తనడకన సాగుతుండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫలితంగా రైతులు మిగతా పనులు పక్కన బెట్టి మార్కెట్ యా ర్డులోనే పడిగాపులు కాస్తున్నారు. తేమ పరీక్షలు నిర్వహించి వారం రోజులు దాటినా అధికారులు ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ఆదివారం రాత్రి కురిసిన వర్షం రైతుల కష్టాలను మరింత పెంచింది. మార్కెట్ యార్డులో నిల్వ ఉన్న ధాన్యపు రాశులు తడిసి ముద్దయ్యాయి. రాశుల కింద నీరు చేరింది. దీనికితోడు స్థానిక మా ర్కెట్ యార్డులో ఇప్పటికే అధిక సంఖ్యలో ధాన్యం కుప్పలు పేరుకుపోవడంతో ఆరబెట్టేందుకు కూడా సరైన స్థలం లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలానే ఉంటే ధాన్యం నాణ్యత దెబ్బతింటుందనే భయంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
హరీశ్ రావు పర్యటన రోజు నాలుగు కాంటాలు..
మాజీ మంత్రి హరీశ్ రావు ఈనెల 7న ఈ ప్రాంతంలో పర్యటించడంతో ఆ ఒక్క రోజున నాలుగు కాంటాలు వేసిన అధికారులు, ఆ తర్వాత రెండు రోజులు రెండు కాంటాలు వేసి, గత రెండు రోజులుగా పూర్తిగా నిలిపివేశారని రైతులు వాపోతున్నారు. ఇక కొనుగోలు చేసిన ధాన్యాన్ని కూడా వెంటనే లారీల్లో ఎత్తకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సేకరించిన ధాన్యాన్ని తరలించేందుకు వారం రోజుల సమయం పడుతోంది. అప్పటివరకు రైతులు ధాన్యం బస్తాల దగ్గరే రాత్రింబవళ్లు కాపలా ఉండాల్సి వస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాంటాలు వేగవంతం చేసి ఆదుకోవాలని అన్నదాత లు కోరుతున్నారు.
నెల రోజులవుతోంది…
వడ్లు తెచ్చి నెల రోజులు కావస్తోంది. నా వరుస సంఖ్య 116, ప్రస్తుతం 50 నం బర్ దాటింది. ఇలానే కాంటాలు వేస్తే మరో నెల పడుతుంది. రాత్రింబవళ్లు కుప్ప దగ్గరే ఉండాల్సి వస్తోంది. మిగ తా వ్యవసాయ పనులు చేయలేక పోతున్నా. కాంటాలు పెంచి త్వరగా కొనుగోలు చేయాలి.
-పాలెం అశోక్ గౌడ్, రైతు, లక్కారం
ఆరబెట్ట్టేందుకు జాగా లేదు..
ధాన్యం పోసి పది రోజులు దాటింది. నిన్న రాత్రి వానకు తడిసింది. పక్కన కుప్పలు పేరుకుపోవడంతో ఆరబెట్టెందుకు జాగా లేదు. నాకన్నా రెండు వారాల ముందు వచ్చినా వారివే కాంటాలు వేయ లేదు. చేసేదేమీ లేక కుప్ప ఎత్తుకొని పోయి దళారులకు విక్రయించుదామని ప్రయత్నం చేస్తున్నా.
-పగిళ్ల గోపాల్ రెడ్డి, రైతు, చిన్నకొండూర్