కొండమల్లేపల్లి, సెప్టెంబర్ 14 : యూరియా కోసం రైతులకు ఎదురు చూపులు తప్పడం లేదు. ప్రతి రోజూ యూరియా వచ్చిందా.. అంటూ మండల కేంద్రానికి వచ్చిపోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున రైతులకు యూరియా అవసరం చాలా ఉంటుంది. ఇలాంటి సమయంలో యూరియాను ప్రభుత్వం అందుబాటులో ఉంచడం లేదంటూ రైతులు మండి పడుతున్నారు. వ్యవసాయ పనులు వదిలేసి మీ చుట్టే తిరగాలా అంటూ మండిపడుతున్నారు. కొండమల్లేపల్లిలోని సహకార సంఘానికి యూరియా వస్తున్నా అది సరిపోవడంలేదని అధికారులు పేర్కొంటున్నారు. ఆదివారం సెలవైనప్పటికీ రైతులకు యూరియా తిప్పలు తప్పడంలేదు.
ఆదివారం రైతులు కొండమల్లేపల్లి పీఏసీఎస్ వద్దకు వచ్చి యూరియా ఎప్పుడొస్తుందంటూ అధికారులను నిలదీశారు. ఒక్కో రైతు ఒక ఎకరం నుంచి పది ఎకరాల వరకు సాగుచేస్తున్న పరిస్థితుల్లో రెండు బస్తాలు ఎలా సరిపోతాయని ప్రశ్నిస్తున్నారు. యూరియా కోసం రైతులు పడరాని పాట్లు పడుతుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని రైతులు వాపోతున్నారు. గత పదేండ్లలో యూరియా కోసం ఇంతగా ఇబ్బందులు పడిన దాఖాలాలు లేవని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే రైతులకు కష్టాలు మళ్లీ మొదలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు సొసైటీ సిబ్బందితో గొడవ పడుతుండటంతో స్థానిక ఎస్ఐ అజ్మీరా రమేష్ ఆధ్వర్యంలో టోకెన్లు ఇచ్చి సోమవారం రావాలంటూ రైతులకు సూచించారు.
రైతులకు తగిన మొత్తంలో యూరియాను అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. మూడు నాలుగు రోజులగా యూరియా కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా యూరియా దొరకడం లేదు. పంటలకు యూరియా లేకపోతే దిగుబడి ఎలా వస్తుంది. కొత్త కంపెనీలకు చెందిన యూరియా బస్తాలు దుకాణాల్లో కనిపిస్తున్నాయి. బ్లాకులో ఒక్కో బస్తా రూ.500 వరకు విక్రయిస్తున్నారు. సొసైటీలు, గ్రోమోర్ కేం ద్రంలో స్టాకు లేదంటున్నారు. యూరియా దొ రక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఎప్పుడో ఎనకటకొచ్చిన యూరియా కరువు ఇప్పుడొచ్చింది. మన దగ్గర కాలం కాక కరువు తాండవిస్తున్నది.. కాలం ఐతే యూరియా దొరకక అగమవుదుం. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏనాడూ యూరియా కొరత లేదు. కావలసినంత యూరియా దొరికేది.