రైతులు ఆరుగాలం కష్టపడి సాగు చేసిన వరి పంటలు నీళ్లు అందకపోవడంతో ఎండిపోతున్నాయి. మాడ్గులపల్లి మండలంలో సాగర్ ఆయకట్టు చివరి భూములు కావడంతో నీళ్లు పూర్తి స్థాయిలో రావడం లేదు. దాంతో పంటలు ఎండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎండిన పంటలను పశువుల మేతకు వదిలేస్తున్న దుస్థితి నెలకొంది.
డి-40 కాల్వకు నీళ్లు రాకపోవడంతోనే..
మాడ్గులపల్లి మండలంలోని సీత్యాతండా, గణపతివారిగూడెం, దేవతలబావిగూడెం, పుచ్చకాయలగూడెం, గొల్లగూడెం, గౌడగూడెం గ్రామాలకు డీ-40 కాల్వ ద్వారా సాగు నీరు అందుతుంది. కాల్వ కింద సుమారు 400 ఎకరాల వరకు సాగు చేస్తున్నారు. ప్రభుత్వం డి-40 కాల్వ ద్వారా నీటిని అందించకపోవడంతో ఆయా గ్రామాల్లో 230 ఎకరాల వరిపంట ఎండిపోయే పరిస్థితి దాపురించింది. ప్రభుత్వం చివరి భూములకు సైతం నీరు అందిస్తామని హామీ ఇచ్చి ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడతో వరి పొలాలు నెర్రెలువారుతున్నాయి.
వేసవికాలంలో భూగర్భజలాలు సైతం అడుగంటడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అప్పులు తీసుకొచ్చి సాగు చేసిన పంటలకు కనీసం పెట్టుబడి కూడా రాలేని దుస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొట్టదదశలో ఉన్న పొలాలు ఎండిపోవడంతో జీవాలు మేత మేస్తున్నాయని, ప్రభుత్వం రైతుల ఇబ్బందులను గుర్తించి డి-40కాల్వకు నీటిని వదిలితే తమ పొలాలు ఎండిపోయేవి కాదని పలువురు రైతులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే డి-40కాల్వ ద్వారా నీటిని అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
అప్పులే మిగిలాయి
నేను ఐదు ఎకరాలు వరి సాగు చేసిన. పంట పొట్ట దశకు వచ్చే సరికి డి-40 కాల్వ ద్వారా నీళ్లు రావడం లేదు. ఐదెకరాల్లో మూడెకరాలు ఎండిపోయింది. ఎండాకాలం కావడంతో మిగతా రెండు ఎకరాలు కూడా ఎండిపోయే పరిస్థితి ఉంది. ఎండిపోయిన మూడెకరాల్లో చేసేదేమీ లేక జీవాలను మేపుతున్నాం. ఎకరానికి 30వేల రూపాయలు పెట్టుబడి పెట్టిన. పెట్టిన ఖర్చు కూడా రాని పరిస్థితి ఉంది. అప్పుల పాలవ్వడమే తప్ప ఏం లేదు. ప్రభుత్వం రైతుభరోసా ఇంతవరకు ఇవ్వలేదు. ఎండిపోయిన పంటలకు ప్రభుత్వం నష్ట పరిహారం ఇచ్చి ఆదుకోవాలి.
-రాచకొండ వెంకన్న, రైతు, గుర్రప్పగూడెం, మాడ్గులపల్లి
రెండెకరాల పంట ఎండిపోయింది
మా సీత్యాతండా గ్రామంలో నేను మూడెకరాలు సాగు చేస్తున్నాయి. నాట్లు పెట్టినప్పుడు నీళ్లు బాగానే వచ్చినయి. కాని తీరా పంట పొట్ట దశకు వచ్చి 16రోజులవుతున్నా డి-40 కాల్వ ద్వారా నీళ్లు బంద్ అయినయి. ఉన్న బోరే దిక్కయింది. ఎండాకాలం కావడంతో బోరులో కూడా నీళ్లు అడుగంటి కేవలం ఒక ఎకరమే పారుతుంది. మిగతా రెండు ఎకరాలు ఎండిపోవడంతో జీవాలు మేస్తున్నాయి. మూడెకరాలకు 60వేల రూపాయల దాక ఖర్చు చేసిన. సాగుకు పెట్టిన ఖర్చు కూడా వెళ్లే పరిస్థితి లేదు. అప్పుల పాలవ్వడమే తప్ప ఏం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మా మొర ఆలకించి కాల్వ ద్వారా నీటిని విడుదల చేయాలి.
-శ్రీనునాయక్ , రైతు, సీత్యాతండా, మాడ్గులపల్లి
రైతుల పట్ల ప్రభుత్వం చిన్న చూపు చూస్తున్నది
కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల చిన్న చూస్తుంది. కనీసం నీళ్లు విడిచిపెట్టకపోవడంతో పొలాలు ఎండిపోతున్నాయి. మా ఊర్లో నేను ఐదు ఎకరాలు సాగు చేస్తున్నా. డి-40 కాల్వ ద్వారా నీరు రాకపోవడంతో పొలాలకు నీరు అందడం లేదు. ఉన్న రెండు బోర్లలో ఒక్కటే బోరు పోస్తుంది. అది కూడా రెండెకరాలకు మాత్రమే పారుతుంది. మిగతా మూడు ఎకరాలు ఎండిపోవడంతో జీవాల మేతకు వదిలేసిన. కాల్వ నీళ్లు వస్తే ఈ సమస్య ఉండేది కాదు.
– లచ్చుము. రైతు, సీత్యాతండా, మాడ్గులపల్లి