నాగారం, మార్చి 27: విద్యుత్‌షాక్‌తో రైతు మృతి చెందిన సంఘటన నాగారం మండలం నాగారం బంగ్లా గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. నాగారం బంగ్లా గ్రామానికి చెందిన రైతు కన్నెబోయిన యాదయ్య గురువారం పొలంలో పని చేయడానికి వెళ్లాడు. విద్యుత్ వైరు తెగి అతడి పొలంలో పడింది. పొలం చుట్టూ తిరిగి వస్తుండగా వైరుపై అతడు కాలు పెట్టిన వెంటనే విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. ఆయన పడిపోయి న విషయాన్ని ఎవ్వరూ గమనించ లేదు.
రాత్రి వరకు యాదయ్య ఇంటికి రాకపోవడంతో పొలం వద్దకు వెళ్లి చూడగా విద్యుత్‌షాక్‌కు గురై మృతి చెందినట్లు కుటుంబీకులు గుర్తించారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే రైతు కన్నెబోయిన యాదయ్య మృతి చెందాడని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో విద్యుత్ వైరు అనేకమార్లు తెగిపడిన విషయాన్ని అధికారులకు విన్నవించినా ఏ మాత్రం పట్టించుకోలేదని ఆరోపించారు. రైతు మృతికి కారణమైన విద్యుత్ అధికారులపై చర్య లు తీసుకోవాలని కోరుతూ శుక్రవారం సూర్యాపేట-జనగాం జాతీయ రహదారిపై మృతుడి ఇంటి ఎదుట ధర్నా చేశారు. రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.