– దామరచర్ల తాసీల్దార్‌కు రైతుల వినతి
దామరచర్ల, జూన్ 04 : దామరచర్ల మండలంలో నకిలీ విత్తనాలను అరికట్టి, యూరియా యాప్ ను రద్దు చేయాలని కోరుతూ మండల రైతు సంఘం ఆధ్వర్యంలో తాసీల్దార్ జవహర్ లాల్‌కు గురువారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం మండల అధ్యక్షుడు మాలోతు వినోద్ నాయక్ మాట్లాడుతూ.. వానాకాలం వ్యవసాయ సీజన్ పనులు ప్రారంభమై వర్షం కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. విత్తనాలు వేసే సమయం ఆసన్నమైంది. మార్కెట్లోకి నకిలీ విత్తనాలు విచ్చేసి ఉన్నాయి. ప్రభుత్వం నిఘా లేదు. రైతులు నకిలీ విత్తనాలతో మళ్లీ మోసపోయి నష్టపోవడం స్పష్టంగా కనబడతుంది కావునా అధికార యంత్రాంగం వెంటనే ఫర్టిలైజర్స్ సీడ్స్ షాపులను తనిఖీ చేసి రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
గత సంవత్సరం యాసంగి సీజన్లో యూరియా కోసం రైతులు అనేక ఇబ్బంది పడ్డారన్నారు. చదువురాని వారు యూరియా కోసం చేతులలో ఫోన్లు పట్టుకుని షాపుల వద్ద గంటల తరబడి నిలబడి అవస్థలు పడుతూ యూరియా తీసుకోవడం జరిగిందన్నారు. అటువంటి పరిస్థితి మళ్లీ ఈ రాష్ట్రంలో లేకుండా ఉండాలంటే తక్షణమే యూరియా యాప్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు కావలసిన యూరియా డీఏపీ కాంప్లెక్స్ ఎరువులు సరిపడా బస్తాలు ప్రణాళిక బద్ధంగా అన్ని షాపులలో నిల్వ ఉంచాలని, అప్పుడు మాత్రమే రైతులకు సులువుగా ఫర్టిలైజర్స్ తీసుకునే సౌలభ్యం ఉంటుందన్నారు. లేనిపక్షంలో రైతులందరిని సమీకరించి పోరాటాలకు సన్నద్ధమౌతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దయానంద్, దుర్గయ్య, సుభాని పాల్గొన్నారు.