ఆసన్ (దక్షిణ కొరియా): బీడబ్ల్యూఎఫ్ కొరియా మాస్టర్స్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువ షట్లర్ అష్మిత చాలిహా అద్భుతం చేసింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో అష్మిత.. 14-21, 21-14, 21-14తో నాలుగో సీడ్ హాన్ జియాన్ జి (చైనా)ని ఓడించి తన కెరీర్లో తొలిసారిగా బీడబ్ల్యూఎఫ్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. 53 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన పోరులో ఈ అసోం అమ్మాయి తొలి గేమ్‌లో ఓడినా తర్వాత వీరోచితంగా పుంజుకుని వరుస గేమ్స్‌లో ప్రత్యర్థిని చిత్తుచేసి విజేతగా నిలిచింది. ఈ విజయంతో అష్మిత.. కొరియా మాస్టర్స్ టైటిల్ గెలిచిన భారత తొలి షట్లర్‌గానూ రికార్డులకెక్కింది. క్వార్టర్స్‌లో టాప్ సీడ్ హినా అకెచి (జపాన్)కి షాకిచ్చిన ఆమె.. సెమీస్‌లో భారత్‌కే చెందిన రక్షితను ఓడించి తొలిసారి బీడబ్ల్యూఎఫ్ ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే. కాగా 2024లో కొరియా ఓపెన్ సందర్భంగా గాయమై కుడికాలి మోకాలి శస్త్రచికిత్స తర్వాత కొన్నాళ్లపాటు విరామం తీసుకున్న ఆమె రెండేండ్ల తర్వాత అదే గడ్డపై టైటిల్ నెగ్గడం విశేషం. ఇక ఈ నెల 1న ముగిసిన తైపీ ఓపెన్‌లో భారత షట్లర్ తన్వి శర్మ విజేతగా నిలువగా వారం రోజుల వ్యవధిలోనే అష్మిత గెలుపుతో భారత్ ఖాతాలో బ్యాక్ టు బ్యాక్ బీడబ్ల్యూఎఫ్ టైటిల్స్ చేరినైట్టెంది.