కొలంబో: శ్రీలంక పర్యటనలో ఉన్న భారత జట్టు శ్రీలంక క్రికెట్ ఎలెవన్‌తో జరిగిన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌ను విజయంతో ముగించింది. రెండో ఇన్నింగ్స్‌లో లంక ఎలెవన్ నిర్దేశించిన 207 పరుగుల లక్ష్యాన్ని భారత్.. 45 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి పూర్తిచేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (61), శుభ్‌మన్ గిల్ (44) శతాధిక భాగస్వామ్యానికి తోడు ఆఖర్లో సిరాజ్ (15 బంతుల్లో 32 నాటౌట్, 1 ఫోర్, 4 సిక్స్‌లు) మెరుపులతో భారత్ ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. అంతకుముందు రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక 200/6 వద్ద డిక్లేర్డ్ చేసింది. నిషాంత్ ఫెర్నాండో (63), నిపుణ్ ధనంజయ (46) రాణించారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా (2/33), గుర్నూర్ (2/37) ప్రత్యర్థిని కట్టడిచేశారు. బంతితో రాణించిన జడ్డూ.. బ్యాట్‌తోనూ మెరిసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
రెండు సెషన్లు ఆడినా..
ఓవర్ నైట్ స్కోరు 357/6 వద్దే తొలి ఇన్నింగ్స్‌ను భారత్ డిక్లేర్డ్ చేయగా మూడో రోజు రెండు సెషన్లు ఆడిన లంకేయులు.. ధాటిగా రన్స్ రాబట్టలేకపోయారు. ఓపెనర్ నిషాంత్ బౌండరీలతో ఆకట్టుకున్నా టాపార్డర్‌లో అతడికి సహకరించేవారే కరువయ్యారు. తొలుత సిరాజ్.. రవీందు (8)ను వికెట్లముందు దొరకబుచ్చుకుని భారత్‌కు తొలి బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత ప్రసిద్ధ్.. పసిందును ఔట్ చేయగా గుర్నూర్.. పవన్‌ను పెవిలియన్ చేర్చాడు. నిషాన్‌తో పవన్ 51 పరుగులు జోడించి ఔటయ్యాడు. ఈ క్రమంలో అంజల బండారా (35), నిపుణ్ లంకను ఆదుకున్నారు.
ఓపెనర్లు వేగంగా..
స్వల్ప ఛేదనలో ఓపెనర్లే సగం పని పూర్తిచేశారు. తొలిరోజు వేలికి గాయమవడంతో క్రీజులోకి రాని గిల్.. రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌గా వచ్చి తొలిటెస్టుకు ముందు తాను పూర్తిగా సన్నద్ధమయ్యానని చెప్పకనే చెప్పాడు. మరోవైపు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన జైస్వాల్.. సెకండ్ ఇన్నింగ్స్‌లో వేగంగా ఆడటంతో భారత్ దాదాపు ఐదు రన్‌రేట్‌తో లక్ష్యం దిశగా సాగింది. ఈ ద్వయం 90 బంతుల్లోనే 105 రన్స్ జోడించింది. గిల్ నిష్క్రమించగా జైస్వాల్ రిటైర్డ్ హర్ట్‌గా డగౌట్‌కు వెళ్లిపోయాడు. రిషభ్ (28), జురెల్ (17) వేగంగా ఆడలేకపోయారు. జడేజా (22 రిటైర్డ్ హర్ట్) ఇన్నింగ్స్‌కు ఊపు తీసుకురాగా చివర్లో సిరాజ్.. నువాంత వేసిన 45వ ఓవర్లో హ్యాట్రిక్ సిక్స్‌లతో మ్యాచ్‌ను ముగించాడు.
సాయి స్థానంలోసర్ఫరాజ్
గాయంతో శ్రీలంకలో టెస్టు సిరీస్‌కు దూరమైన సాయి సుదర్శన్ స్థానాన్ని ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ భర్తీ చేయనున్నాడు. ఈ మేరకు బీసీసీఐ ఆదివారం ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. సర్ఫరాజ్ చివరిసారిగా 2024లో న్యూజిలాండ్‌తో ముంబైలో జరిగిన టెస్టులో ఆడాడు.
సంక్షిప్త స్కోర్లు
శ్రీలంక ఎలెవన్: తొలి ఇన్నింగ్స్ 363/8 డిక్లేర్డ్, రెండో ఇన్నింగ్స్ 200/6 డిక్లేర్డ్; భారత్: ఫస్ట్ ఇన్నింగ్స్ 357/6 డిక్లేర్డ్, సెకండ్ ఇన్నింగ్స్ 214/4