కోదాడ, డిసెంబర్ 13 : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా రాజ్యాంగం మనకు కల్పించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం కోదాడలో ఆయన మాట్లాడుతూ.. గ్రామ ప్రజలకు సేవ చేసే నాయకులను సర్పంచ్‌గా ఎన్నుకోవాలని సూచించారు. రెండున్నర సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో పల్లెలు అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్న విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు. గ్రామాల్లో గత సర్పంచులు చేసిన పనులకు ఇప్పటికీ బిల్లులు అందక ఇబ్బంది పడుతున్నారన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో సజావుగా జరగాల్సిన ఎన్నికలు అలజడుల మధ్య జరుగుతున్నాయన్నారు.
ఇప్పటికే నియోజకవర్గంలో పోలీసులు బీఆర్ఎస్ శ్రేణులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ నేతలను ఎన్నికల బరిలో పోటీ చేయకుండా, నామినేషన్లు వేయకుండా విశ్వ ప్రయత్నాలు చేశారన్నారు. బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులను బెదిరింపులకు గురి చేస్తున్నట్లు తెలిపారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్కటి అమలు చేయలేదన్నారు. బీఆర్ఎస్ పాలనలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో నంబర్ వన్‌గా నిలిపారని కొనియాడారు. వందల కోట్లతో మన ఊరు మన పల్లె కార్యక్రమాన్ని చేపట్టి.. పల్లెలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారన్నారు. అందువల్ల విచక్షణతో ఆలోచించి ఓట్లు వేయాలని నియోజకవర్గ ప్రజలను ఆయన కోరారు.