నీలగిరి, అక్టోబర్ 04 : ప్రతి ఒక్కరూ మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఈ నెల 4 నుండి 12వ తేదీ వరకు మానసిక ఆరోగ్యం- శ్రేయస్సుపై లయన్స్ క్లబ్ ఆఫ్ నల్లగొండ నిర్వహిస్తున్న వారోత్సవాల్లో భాగంగా శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీని ఆమె ప్రారంభించి మాట్లాడారు. ప్రస్తుతం సమాజంలో ప్రతి ఒక్కరూ ఎదో రకంగా మానసికంగా బాధపడుతున్నారని, మరికొందరు మానసిక ఒత్తిడికి లోనవుతున్నారన్నారు. అయినప్పటికీ మనం ఈ సమస్యను పక్కన పెడుతున్నామని, మానసిక ఒత్తిడి తగ్గాలంటే జీవన విధానం మార్చుకోవాలని, స్మార్ట్ ఫోన్ వాడకంను సాధ్యమైనంతగా తగ్గించాలని, ప్రత్యేకించి పాఠశాల, కళాశాల విద్యార్థులు స్మార్ట్ ఫోన్ ను పక్కన పెట్టాలన్నారు.
పెద్దలు సైతం రాత్రి సమయాల్లో ఒత్తిడి లేకుండా ఉన్నప్పుడే మంచి నిద్రతో పాటు, మానసికంగానూ ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. మానసిక ఆరోగ్యంపై లయన్స్ క్లబ్ జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలలు, కళాశాలలో ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. మనిషి శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నంత మాత్రాన సరిపోదని, మానసిక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యమని, దీనికై ఉదయపు నడక, ప్రశాంతత, ఒత్తిడికి లోను కాకుండా ఉండడమే ముఖ్యమని అన్నారు. ఇటీవల కాలంలో చిన్న వయసు వారు సైతం గుండె జబ్బులతో చనిపోతున్న విషయాన్ని మనం గమనిస్తున్నామని, మనిషి అనేక రకాల ఒత్తిళ్లకు గురికావడం జరుగుతున్నదని, ఈ ఒత్తిడికి అన్ని అంశాలు ప్రభావితం చేస్తున్నాయని తెలిపారు.
ప్రతి ఒక్కరూ మానసికంగా దృఢంగా ఉండేలా చూసుకోవాలని, మెదడుకు ఆ విధంగా శిక్షణ ఇవ్వాలని, ఇందుకు గాను తప్పనిసరిగా ఒత్తిడి కల్పించని అంశాలను చదవాలని చెప్పారు. పోటీ పరీక్షలు, ఇతర అంశాలలో పేద పిల్లలకు సహాయం చేసేందుకు నల్లగొండలో ఒక టౌన్ హాల్ నిర్మించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని, ఈ విషయంలో లయన్స్ క్లబ్ సహకరించాలని కోరారు. లయన్స్ క్లబ్ లాగా అందరూ ముందుకు వచ్చి సామాజిక సేవా పద్ధతిని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్ అన్నారు. లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ గవర్నర్ మదన్ మోహన్, నల్లగొండ ఆర్డీఓ వై.అశోక్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Nilagiri : ప్రతి ఒక్కరూ మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి