నందికొండ, అక్టోబర్ 10: తమకు జీతాలను సకాలంలో చెల్లించాలని కోరుతూ నాగార్జునసాగర్ హిల్‌కాలనీలోని కమలా నెహ్రూ ఏరియా దవాఖాన సిబ్బంది శుక్రవారం భోజన విరామ సమయంలో ఫ్లకార్డులతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగులకు జీతాలు సకాలంలో రాకపోవడంతో ఈఎంఐలు చెల్లించలేక, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామన్నారు.
అప్పులు తెస్తుండటంతో జీతం డబ్బు వడ్డీలకూ సరిపోని పరిస్థితి ఏర్పడుతోందని వాపోయారు. కాంట్రాక్ట ఉద్యోగులకు 4 నెలలుగా జీతాలు రాలేదన్నారు. ఇల్లు గడవడం కష్టంగా ఉందన్నారు. సకాలంలో ఉద్యోగులకు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాలను చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డాక్టర్లు మోతీలాల్, చక్రవర్తి, శ్రీజ్యోతి, ఫార్మసీ అధికారి సత్యం, హెడ్ నర్సులు, నర్సులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
రామన్నపేట, అక్టోబర్ 10: ఒకటో తేదీనే జీతాలు చెల్లించాలని కోరుతూ తెలంగాణ మెడికల్ ఎంప్లాయీస్ రాష్ట్ర యూనియన్ పిలుపుమేరకు రామన్నపేట ప్రభుత్వ దవాఖానలో శుక్రవారం వైద్యులు, వైద్య సిబ్బంది ఫ్లకార్డులతో మౌనంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షుడు రావిటి సతీష్‌కుమార్ మాట్లాడుతూ ప్రతినెలా సకాలంలో జీతాలు రాకపోవడంతో వైద్యులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
10వ తేదీ దాటినా నేటి వరకూ జీతాలు అందలేదని వాపోయారు. వెంటనే డీఎస్ హెచ్ ఏర్పాటు చేసి ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైద్యులు దేవేందర్, నవీన్‌సింగ్, రజిని, నర్సింగ్ సూపరింటెండెంట్ రాణి, సిబ్బంది ఉదయ్‌రాజ్, జేఏ శ్రీనివాస్, రేడియోగ్రాఫర్ శ్రీనివాస్, వాసంతి, నర్సింగ్ ఆఫీసర్స్ సుశీల, వసంత, మారమ్మ, సునీత, భూపాల, శ్యామల, రాధ తదితరులు పాల్గొన్నారు.