నల్లగొండ రూరల్, అక్టోబర్ 11 : బీసీలకు రిజర్వేషన్లను కల్పించిన తర్వాతే ఎన్నికల నిర్వహించాలని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు ఐతగూడ జనార్దన్ గౌడ్ డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్లో గల అమరవీరుల స్థూపం వద్ద ఈ నెల 14న జరిగే ‘రాష్ట్ర వ్యాప్త బంద్’ ను విజయవంతం చేయాలని కోరుతూ పోస్టులను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీల 42 శాతం రిజర్వేషన్లపై జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా ఈ నెల 14న జరిగే ‘రాష్ట్ర వ్యాప్త బంద్’ చరిత్రలో ఎన్నడు జరగని విధంగా బీసీ లోకం చేపట్టాలని, గ్రామాల్లో సైతం ఈ బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు . చట్ట సభలలో రిజర్వేషన్లు సాధించేంతవరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు.ఈ ఉద్యమం ప్రజాస్వామ్య బద్ధంగా బిసిల ఆత్మగౌరవం కోసం, అవమానాలకు వ్యతిరేకంగా కొనసాగుతుంది అన్నారు. హైకోర్టు ఎన్నికల ప్రక్రియను ఆపడం దురదృష్టకరమని ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యాక ఎన్నికలను అపరాదని, గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయని, ఆ ఆదేశాలకు విరుద్ధంగా వాయిదా వేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. ఈ నిర్ణయిం రాష్ట్రంలోని 56 శాతం బిసి ప్రజల హక్కులకు విఘాతం కలిగి స్తుందని, బీసిల ఆత్మగౌరవం దెబ్బతినడమేనని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రాలు రిజర్వేషన్లు పెంచుకోవచ్చని రాజ్యంగంలోని 243/ డి6 షెడ్యూల్ స్పష్టంగా ఉందని అన్నారు. కానీ, రిజర్వేషన్లు 50 శాతానికి పరిమితం చేయడం ఏంటని ఫైర్ అయ్యారు. బీసీలు ఎంత ఉన్నారో.. తనుకు అంత రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. బీసీ బిల్లును పార్లమెంట్లోనూ పెట్టాలని పోరాడుతున్నామని తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు మద్దతుగా కలిసి రావాలని పిలుపు నిచ్చారు. రిజర్వేషన్లపై బీసీలు గంపెడాశలు పెట్టుకున్నారని, ఎట్టి పరిస్థితుల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేశాకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షుడు పందుల సైదులు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు గండుచెరువు వెంకన్న గౌడ్, బిసి రాజ్యాధికార సమితి నల్గొండ జిల్లా అధ్యక్షులు కర్నాటి యాదగిరి, బిసి సంక్షేమ సంఘం జిల్లా నాయకుడు అనంత నాగరాజు, బీసీ విద్యార్థి సంఘం జిల్లా నాయకుడు కన్నబోయిన రాజు యాదవ్, ప్రెసిడెంట్ మార్గం సతీష్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు గడగోజు విజయకుమార్, పట్టణ అధ్యక్షులు చిన్నోజు రాజు తదితరులు పాల్గొన్నారు.