దేవరకొండ రూరల్, డిసెంబర్ 20 : రాబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేశాకే ఎన్నికలు జరపాలని సామాజికవేత్త, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం దేవరకొండ పట్టణంలో స్థానిక అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కామారెడ్డి డిక్లరేషన్‌కి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో చట్టబద్ధత కల్పించనప్పటికీ బీసీలు ఐక్యమై జనరల్ స్థానాల్లోనూ అత్యధిక స్థానాలు గెలిచి ఐక్యతను చాటారని తెలిపారు.
ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీల న్యాయమైన డిమాండ్‌ను నెరవేర్చాలన్నారు. పార్టీ పరంగా కాకుండా చట్టబద్ధంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పించాకే ఎంపీఈసీ, జడ్పీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్, కో ఆపరేటివ్ బ్యాంక్ తదితర ఎన్నికలు జరిపాలన్నారు. లేనియెడల పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి రిజర్వేషన్లు సాధించే వరకు పోరాటం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చోల్లేటి భాస్కరాచారి, పున్న వెంకటేశం నేత, పెరికేటి శ్రీనివాసాచారి, మాకం చంద్రమౌళి, బొమ్ము వెంకటయ్య, పున్న భిక్షమయ్య, శేఖర్ పాల్గొన్నారు.

Devarakonda Rural : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాకే ఎన్నికలు జరపాలి : శ్రీనివాస్ గౌడ్