పెద్దఅడిశర్లపల్లి, మార్చి 28 : భావితరాల భవిష్యత్ గర్భిణులపై ఆధారపడి ఉందని, వైద్య, స్త్రీశిశు సంరక్షణ శాఖలు వారి రక్షణకు అన్ని రకాల చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గుడిపల్లి మండల కేంద్రంలోని పీహెచ్సీలో ఆయా శాఖల ఆధ్వర్యంలో షౌష్టికాహరం, వైద్య చికిత్సపై శుక్రవారం అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ దేవరకొండ ప్రాంతంలో రక్తహీనత, మాతా, శిశు మరణాలు, మూఢ నమ్మకాలు, బాల్య వివాహాలు వంటివి ఉన్నాయని, వీటిపై గ్రామస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. ప్రైవేటు దవాఖానల్లో లింగ నిర్ధారణ పరీక్షలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విధి నిర్వహణలో సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే చర్యలుంటాయని, క్షేత్ర స్థాయిలో పనిచేసి వైద్య సేవలు అందించాలని అదేశించారు. దేవరకొండ ఏఎస్పీ మౌనిక మాట్లాడుతూ మహిళపై దాడుల చేస్తే చట్టపరమైన చర్యలుంటాయన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి పుట్ల శ్రీనివాస్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి కృష్ణవేణి, డాక్టర్ రాజేశ్, ఎంపీడీఓ పద్మ, తాసీల్దార్ మధుహాసిని పాల్గొన్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన గుడిపల్లి మండల కేంద్రంలో పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కలెక్టర్‌ను విన్నవించారు. పోలీసు సేవలు దూరంగా ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అదేవిధంగా తాసీల్దార్ కార్యాలయంలో పూర్తి స్థాయి ఫర్నీచర్ ఏర్పాటు చేయాలని కోరారు.