ప్రస్తుత యాసంగి సీజన్లో పంటలు చేతికొచ్చే సమయంలో చెడగొట్టు వానలతో రైతులకు నష్టం వాటిల్లుతున్నది. ముఖ్యంగా వరి పంటతోపాటు మామిడి తోటలు దెబ్బతింటున్నాయి. ఈదురు గాలులు, వడగండ్లతో కూడిన వర్షం కురుస్తుండడంతో ప్రభావం ఎక్కువగా ఉంటున్నది. మార్చి నెలలో కురిసిన వర్షానికి సైతం ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల పంటలు దెబ్బతినగా ఈ నెలలో పలుమార్లు నష్టం వాటిల్లింది. నల్లగొండ జిల్లాలో ఈ నెలలోనే 7,559 ఎకరాల్లో వివిధ రకాల పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా వేశారు. బాధిత రైతులను ఆదుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో అధికారులు సమగ్ర నివేదికను సిద్ధం చేస్తున్నారు. నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో నష్టం అంచనాలు పూర్తికాగా, సూర్యాపేట జిల్లాలో ఒకటి రెండ్రోజుల్లో కానున్నది.
– నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ)
నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్27(నమస్తే తెలంగాణ):అకాల వర్షాలు రైతులకు తీవ్ర నష్టం కలుగుజేస్తున్నాయి. ముఖ్యంగా కోత దశలో ఉన్న వరి పంట వడగండ్ల వానతో పాటు ఈదురుగాలులతో ఎక్కువగా దెబ్బతింటుంది. మార్చిలో నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో కలిపి 4,283 మందికి సంబంధించి 5,699 ఎకరాల్లో వివిధ రకాల పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు తేల్చారు. వీరందరికీ ఎకరానికి రూ. 10 వేల చొప్పున నష్టపరిహారం ఇచ్చేందుకు ఇప్పటికే రంగం సిద్ధ్దమైంది. ఈ క్రమంలో ఏప్రిల్‌లో సైతం పలు దఫాలుగా చెడగొట్టు వానలు కురుస్తూనే ఉన్నాయి. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలకు వడగండ్లు తోడు కావడంతో నష్టం తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ నెల 3,4 తేదీల్లో, తిరిగి 21,22,23,24 తేదీల్లోనూ అకాల వర్షాలు కురిశాయి. వింతో పలు మండలాల్లో వరితో పాటు మామిడి, ఇతర పంటలు దెబ్బతిన్నాయి. నల్లగొండ జిల్లాలో వ్యవసాయాధికారుల లెక్కల ప్రకారం ఏప్రిల్‌లో 3,981 మంది రైతులకు సంబంధించిన 7,599 ఎకరాల్లో వివిధ రకాల పంటలు దెబ్బతిన్నాయి. ఇందులో ప్రధానంగా 6,960 ఎకరాల్లో వరి, 502 ఎకరాల్లో ఉద్యానవన, ఇతర పంటలు ఉన్నాయి.
ఈ నెల 3, 4వ తేదీల్లో కురిసిన వర్షాలకు గుర్రంపోడు, చండూరు, శాలిగౌరారం, మునుగోడు, కనగల్, నల్లగొండ మండలాల్లోని 26 గ్రామాల్లో పంటలకు నష్టం జరిగింది. ఇక ఈ నెల 21న చండూరు మండలంలో 200 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. 22న కట్టంగూర్‌లో 60 ఎకరాల్లో, శాలిగౌరారంలో 151 ఎకరాల్లో పంటలకు నష్టం జరిగింది. ఈ నెల 23న శాలిగౌరారంలో 169 ఎకరాల్లో వరిపంట దెబ్బతిన్నది. 24న ఎక్కువ నష్టం కలుగజేసింది. డిండిలో 1,245 ఎకరాల్లో, దేవరకొండలో 391 ఎకరాల్లో, చందంపేటలో 324 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. చివరగా ఈ నెల 25న శాలిగౌరారం మండలంలో 152 ఎకరాల్లో పంట అకాల వర్షానికి దెబ్బతిన్నది. అన్నిచోట్ల కూడా ఎక్కువగా వరి పంటకే నష్టం జరిగినట్లు స్పష్టమవుతున్నది. క్షేత్రస్థాయిలో పర్యటించిన వ్యవసాయ శాఖ అధికారులు జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో పంట నష్టం అంచనాలపై సమగ్ర నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించనున్నారు.