సూర్యాపేట, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ) : “దశాబ్దాల తరబడి వెనుకబాటుకు గురైన నల్లగొండ, సూర్యాపేట ప్రాంతాలను కాపాడింది రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆరే.. ఒకనాడు నాగరికతతో విరాజిల్లిన ఈ ప్రాంతం గత ఉమ్మడి పాలనలో 60 ఏండ్లు వెనక్కి పోయింది. మిషన్ భగీరథతో స్వచ్ఛమైన తాగునీరు రావడంతో ఫ్లోరైడ్ భూతం తరలి పోయింది. ప్రాజెక్టుల్లో నుంచి కాల్వల్లోకి నీళ్లు గలగలా పారుతున్నాయి. అడగడమే తరువాయిగా వేల కోట్లు ఇవ్వడంతో జరుగని అభివృద్ధి లేదు. అభివృద్ధి విషయంలో గతాన్ని పోల్చుకుంటూ నేటి పరిస్థితిని బేరీజు వేసుకుంటున్న జనం గత పాలకులకు శాపనార్థాలు పెడుతున్నారు. రాబోయే ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది… కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారు.. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు మరిన్ని నిధులు ఇచ్చేది కూడా ఆయనే” అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన ప్రగతి నివేదన సభలో మంత్రి ప్రసంగం ఆయన మాటల్లోనే..
“అరవై ఏండ్ల పాటు ఏదీ చేయని దివాలాకోరు ప్రతి పక్షాల్లో నేటికీ మార్పు కనిపించడం లేదు, అడుగడుగునా అభివృద్ధిని అడ్డుకునేందుకు కుటిల యత్నాలు చేస్తూ కేసులు వేస్తున్నారు. మూడో సారి కూడా ప్రతిపక్షాలకు కర్రుకాల్చి వాతపెడితేనే తిక్క కుదిరి అభివృద్ధికి సహకరిస్తారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల కోసం రూ. వేల కోట్లు వెచ్చించి జిల్లా ప్రజల సంతోషానికి కారకులు.. తెలంగాణ రాష్ట్రం వస్తదా రాదా అనే సందేహాన్ని పటాపంచలు చేసి.. తెలంగాణ రాష్ర్టాన్ని తేవడమే కాదు రాష్ర్టాన్ని అభివృద్ధి చేసి భారతదేశానికి ఒక నమూనాగా చేసి చూపిన.. సూర్యాపేట ప్రజలకు బ్రహ్మండమైన అభివృద్ధి స్తంభాలను అంకితం ఇచ్చేందుకు వచ్చిన నా రాజకీయ గురువు, ఆరాధ్య దైవం, పెద్దలు, బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌కు జిల్లా ప్రజల తరఫున స్వాగతం పలుకుతూ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మీ వెంటే ఉంది సూర్యాపేట నియోజకవర్గం అని చెప్పేందుకు… సీఎం కేసీఆర్ కంచు కోట సూర్యాపేట అని చెప్పేందుకు.. మీరు ఇచ్చిన ప్రభుత్వ భనాలను మీ చేతుల మీదుగా ప్రారంభించుకున్నాం.
తెలంగాణ ఏర్పాటు నుంచి ప్రతిపక్షాలు అడుగడుగునా అభివృద్ధిని అడ్డుకుంటున్నాయి. కాళేశ్వరం పూర్తి కాకుండా వేసిన కేసులు మనందరికీ తెలిసిందే. సూర్యాపేటను సర్వనాశనం చేసిన నాయకులు పట్టణ అభివృద్ధిని సహించక అర్థం లేని కేసులతో అభివృద్ధిని ఆలస్యం చేశారు. అయినా అభివృద్ధి మాత్రమే గెలుస్తుందనే ధీమాతో ఓపిక పట్టి ఒక్కొక్కటిగా కేసులను అధిగమిస్తూ పనులు చేసుకుంటూ ముందుకు పోతున్నాము. సూర్యాపేట కాకతీయుల కాలం నుంచి నిజాం వరకు వ్యవసాయంలో, నాగరికతో వెల్లివిరిసింది. అయితే గత కాంగ్రెస్ పాలనలో 60 యేండ్లు వెనక్కి పోయింది. ఒకప్పుడు అందరికీ అన్నం పెట్టిన ఈ జిల్లా తానే అన్నం లేక చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. నాటి పాలకుల లోపాలు, పాపాల వల్ల భూగర్భ జలాలు అడుగంటి.. ఫ్లోరిన్ నీటితో ప్రజలను కబలించింది.
ఉద్యమ ప్రారంభలోనే నాతో కలిసి నల్లగొండలో ఊరూరా తిరిగి ప్రజల బాధలు చూసి కన్నీళ్లు పెట్టుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మిమ్మల్ని కాపాడుకుంట అని పోచంపాడులో రైతన్నలకు ధైర్యమిచ్చి.. తప్పకుండా తెలంగాణ తెస్తానని చెప్పారు. అదే క్రమంలో తెలంగాణను సాధించి నేడు ఈ జిల్లాను ఏడేండ్లలో దేశానికి అన్నం పెట్టే జిల్లాగా మార్చిన నాయకుడు మన సీఎం కేసీఆర్. తెలంగాణ ఏర్పడక ముందు 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఈ జిల్లాలో పండితే నేడు 40 లక్షల మెట్రిక్ టన్నులకు చేరి.. నేడు దేశానికి అన్నం పెడుతుంది. ఇక తుంగతుర్తి, హుజూర్నగర్, మునుగోడు ఇలా ఏ నియోజకవర్గమైనా పొద్దంతా జెండాలు పట్టుకొని రాత్రంతా కొట్లాడుకున్న ఈ ప్రాంతాలు కృష్ణా, గోదావరి జలాలతో పచ్చని పంట పొలాలతో కళకళలాడుతుండగా.. ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారు. సూర్యాపేటకు నీళ్లు రావాలని భీంరెడ్డి నర్సింహారెడ్డి కొట్లాడారు. అలాగే మాకు నీళ్లు వస్తాయా అని ఎదురూ చూసి ఏడ్చి ఏడ్చి ఒక తరం వెళ్లి పోగా ఇంకోతరం నిరాశతో ఉన్న సమయంలో పక్క రాష్ర్టాలను ఒప్పించి కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించి వందలాది కేసులను తిప్పి కొట్టి మూడేండ్లలో ప్రాజెక్టును పూర్తి చేసి మొదటి నీటి చుక్క పెన్‌పహాడ్ మండలం రావి చెరువు, చినసీతారాం తండాకు చేరుకోగా.. ఈ నీళ్లతో తుంగతుర్తి, సూర్యాపేట ప్రాంతాలు సస్యశ్యామలం అయ్యాయి. ఇది కేవలం సీఎం కేసీఆర్ రాజనీతిజ్ఞతకు నిదర్శనం. నిజమే ఇవాళ సూర్యాపేటను చూసుకుంటే 2014లో ఎలా ఉన్నాము.. నేటి పరిస్థితి ఏంటో అందరికీ తెలిసిందే. మన మిత్రులు దుశ్చర్ల సత్యనారాయణ చెప్పినట్లు ఒక పట్టణం డ్రైనేజీ నీళ్లను మరో పట్టణానికి మంచినీరుగా తాపించిన దౌర్భాగ్య పరిస్థితిని గత పాలకులు కల్పించారు.
హామీలన్నీ నెరవేర్చిన నాయకుడు సీఎం కేసీఆర్
2014లో కేసీఆర్ ఒక్కటే చెప్పిండు.. జగదీశ్‌ను గెలిపించండి మూసీ మురికినీటి పీడ వదిలిస్తామని. గత ఐదేండ్లుగా మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన కృష్ణా జలాలను అందిస్తున్నామంటే ఆ ఘనత సీఎం కేసీఆర్‌దే. సూర్యాపేటను జిల్లాగా చేసి ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిండు. 2014లో అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో సూర్యాపేట మురికి కూపంగా ఉండి రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉందంటే.. స్పందించిన సీఎం వందల కోట్ల రూపాయల నిధులిచ్చారు. దాంతో సూర్యాపేటను సురందమైన పట్టణంగా తీర్చిదిద్దుకునే అవకాశం కలిగింది. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా కేవలం సూర్యాపేటలో మాత్రమే రెండు ట్యాంక్ బండ్లు వచ్చాయి. ఇది కూడా సీఎం కేసీఆర్ ఘనతే. గతంలో సాయంత్రం పిల్లలతో ఓ గంట పాటు ఆహ్లాదంగా గడిపేందుకు, పిల్లలు ఆడుకునేందుకు పోవాలంటే ఒక్క పార్కు లేదు.. నేడు 70కి పైనే చిన్న, పెద్ద పార్కులు వచ్చాయి. చివరకు చనిపోయిన వ్యక్తిని గౌరవంగా పంపుదామంటే అధ్వాన్నమైన స్మశాన వాటికలు ఉండగా సీఎం కేసీఆర్ ఇచ్చిన నిధులతో హిందూ, ముస్లిం, క్రిస్టియన్లకు అద్భుతంగా స్మశాన వాటిలకను ఏర్పాటు చేసి.. వాటిని పార్కులను తలపించే రీతిన తీర్చిదిద్దుకున్నాం. మొత్తం మీద ఆత్మగౌరవంతో తలెత్తుకునేలా సూర్యాపేటను నిర్మించుకున్నాం.
రాబోయే ఎన్నికల్లో సైతం బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది, ముఖ్యమంత్రిగా కేసీఆరే అవుతారు.. దాంతో మన నియోజకవర్గం మరింత అభివృద్ధి చేసుకుంటాం” అని మంత్రి జగదీశ్‌రెడ్డి చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, జడ్పీ చైర్మన్లు గుజ్జ దీపికాయుగంధర్‌రావు, బండ నరేందర్‌రెడ్డి, ఎలిమినేటి సందీప్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీలు తక్కెళ్లపల్లి రవీందర్రావు, ఎంసీ కోటిరెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్‌కుమార్, శానంపూడి సైదిరెడ్డి, బొల్లం మల్లయ్యయాదవ్, కంచర్ల భూపాల్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, నల్లమోతు భాస్కర్‌రావు, నోముల భగత్, రమావత్ రవీంద్రకుమార్, పైళ్ల శేఖర్‌రెడ్డి, కార్పొరేషన్ల చైర్మన్లు సోమ భరతకుమార్, దూదిమెట్ల బాలరాజుయాదవ్, మేడె రాజీవ్‌సాగర్, ఎర్రోళ్ల శ్రీనివాస్, రాంచందర్‌నాయక్, తిప్పన విజసింహారెడ్డి, పల్లె రవికుమార్, సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజన్‌కుమార్, సీఎంఓ అధికారులు స్మితాసబర్వాల్, ప్రియాంక వర్గిస్, కలెక్టర్ యస్.వెంకట్రావు, ఎస్పీ రాజేంద్రప్రసాద్, అదనపు కలెక్టర్లు ప్రియాంక, వెంకట్‌రెడ్డి, ఎస్టేట్ ఆఫీసర్ అరుణిమ, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి, జేడీ మల్లేశ్, డీడీ అజ్మీరారాజు, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, కమిషనర్ రామానుజులరెడ్డి, మార్కెట్ సెక్రటరీ ఫసియొద్దీన్, ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
మహాప్రస్థానం అద్భుతం
సూర్యాపేట మహాప్రస్థానం సెల్ఫీలకే కాదు ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకునేంత అద్భుతంగా ఉందని సీఎం కేసీఆర్ ప్రశంసించారు. మెడికల్ కళాశాల ప్రారంభోత్సవం అనంతరం మోడల్ మార్కెట్‌ను ప్రారంభించేందుకు వెళ్తూ మార్గమధ్యంలో పచ్చని అందాలు కనిపించడంతో అదేంటని మంత్రి జగదీశ్‌రెడ్డిని ప్రశ్నించారు. ఇది మినీ ట్యాంక్ బండ్. ఇక్కడ బోటింగ్ కూడా ఉంది. ప్రజలు బాగా ఎంజాయ్ చేస్తున్నారని మంత్రి వివరిస్తూ ట్యాంక్‌బండ్ పక్కనే ఉన్న మహాప్రస్థానాన్ని ముఖ్యమంత్రికి చూపించారు. ఈ మహాప్రస్థానంలో పట్టణవాసులు ప్రతినిత్యం వచ్చి సెల్ఫీలు దిగుతున్నారని ముఖ్యమంత్రికి మంత్రి చెప్పగా ఇక్కడ సెల్ఫీలే కాదు ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా చేసుకునేంత అద్భుతంగా ఉందం టూ ఆ స్థాయిలో మహాప్రస్థానాన్ని తీర్చిదిద్దారని ప్రశంసించడం విశేషం. దాంతో వాహనంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు సైతం మహాప్రస్థానాన్ని చూసి అద్భుతంగా ఉందని కొనియాడారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన సాగిందిలా..