రాష్ట్ర వ్యాప్తంగా సాధారణ ఎన్నికలకు శుక్రవారం ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయనుండగా..
ఆ వెంటనే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్నదని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎస్పీ అపూర్వరావుతో కలిసి గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ 10వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని, రోజూ ఉదయం 11నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు స్వీకరిస్తామని తెలిపారు.
ఇందుకోసం జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పటిష్ట ఏర్పాట్లు చేశామన్నారు. 13వ తేదీన స్క్రూటినీ నిర్వహిస్తామని, 15వరకు ఉపసంహరణకు గడువు ఉన్నదని చెప్పారు. ఈ నెల 30న ఉదయం 7నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్, డిసెంబర్ 3న కౌంటింగ్ నిర్వహిస్తామని తెలిపారు. ఎన్నికల కోడ్ ఉన్నందున నిబంధనల ప్రకారం నడుచుకోవాలని, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆర్వో కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, లోపలికి నలుగురికి మాత్రమే అనుమతి ఉంటుందని ఎస్పీ అపూర్వరావు తెలిపారు.
రామగిరి, నవంబర్ 2 : అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం నుంచి ఈ నెల 10వరకు కొనసాగనుంది. కాగా.. నామినేషన్లు సమర్పించేందుకు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు మంచి ముహూర్తాలు చూసుకుంటున్నారు. ఈ నెల 4, 7, 8, 9, 10 తేదీల్లో మంచి ఘడియలు ఉన్నట్లు పురోహితులు, సిద్ధాంతులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో తమకు అనుకూలమైన తేదీల్లో నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అత్యధికంగా ఈ నెల 7, 8, 9తేదీల్లో నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.
రామగిరి, నవంబర్ 2 : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభమై ఈ నెల 10వ తేదీన ముగియనున్నది. కాగా, నామినేషన్లు వేసేందుకు 4,7,8,9,10తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నట్లు పురోహితులు, సిద్ధాంతులు సూచిస్తున్నారు. అయితే మంచి రోజును చూసుకునే అభ్యర్థులంతా నామినేషన్లు వేయనున్నారు. మొదటి రోజు శుక్రవారం అయినప్పుటికీ షష్టి కావడంతో ఎవరూ నామినేషన్ల వేసేందుకు సుముఖత చూపించకపోవచ్చు. 4న శనివారం సప్తమి ఉంది. 7న మంగళవారం దశమి, 8న బుధవారం దశమి తదుపరి ఏకాదశి వస్తుంది. 9న గురువారం దశమి తదుపరి ఏకాదశి, 10న శుక్రవారం ద్వాదశితో కూడిన ముహూర్తాలున్నాయి. దాంతో అత్యధికంగా 7,8,9 తేదీల్లో నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
నామినేషన్లు వేసేందుకు ఈ నెల 4,7,8,9,10న మంచి రోజులున్నాయి. వీటిలో 4వ తేదీన శనివారం కాబట్టి ఆ రోజు వద్దని కొంతమంది భావించే అవకాశం ఉంది. అత్యంత అనుకూలంగా ఈ నెల 7,8,9,10 తేదీల్లో శుభగడియాలున్నాయి. కాబట్టి ఈ తేదీల్లో నామినేషన్లు దాఖలు చేసేందేకు ఎంతో అనుకూలంగా ఉంటాయి.
– పెన్నా మోహనశర్మ, ప్రముఖ పురోహితులు, జిల్లా వైదిక బ్రాహ్మణ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్