హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర రాజకీయాల్లో ఉతంఠ రేపుతున్న పార్టీ ఫిరాయింపుల కేసుల విచారణ కీలక ఘట్టానికి చేరుకున్నది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ విచారణను పూర్తి చేసి, తీర్పును రిజర్వ్ చేశారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై దాఖలైన అనర్హత వేటు పిటిషన్‌పై శనివారం తు ది విచారణ జరిగింది. ఆయన తరఫు న్యాయవాదులు హాజరై వాదనలను వినిపించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్‌లో చేరిన దానంపై చర్యలు తీసుకోవాలని దాఖలైన పిటిషన్‌పై వాదనలు విన్న స్పీకర్, తన నిర్ణయాన్ని వెల్లడించకుండా తీర్పు ను రిజర్వ్‌లో ఉంచారు.
స్పీకర్ తీర్పుపై ఉత్కంఠ
స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై గురువారమే విచారణ పూర్తయింది. పలుమార్లు వాదనల అనంతరం స్పీకర్ ఈ కేసులోనూ తీర్పును రిజర్వ్ చేశారు. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు దాఖలు కాగా, ఈ ప్రక్రియ ఇప్పుడు ముగింపు దశకు చేరుకున్నది. ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంలో ఇప్పటికే ఎనిమిది మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించలేదని పేరొంటూ స్పీకర్ వారికి క్లీన్చిట్ ఇచ్చారు. మిగిలిన ఇద్దరు కీలక నేతలు (దానం నాగేందర్, కడియం శ్రీహరి) కేసుల్లో విచారణ పూర్తయింది. రిజర్వ్ చేసిన ఈ రెండు కేసులపై స్పీకర్ త్వరలోనే తుది నిర్ణయాన్ని వెలువరించే అవకాశం ఉన్నది.