యాదాద్రి భువనగిరి, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం అభాసుపాలవుతున్నది. స్థానిక సంస్థల ఎన్నికల కోసం మొదట పల్లెల్లో ఇస్తామన్న చీరలు.. అందని ద్రాక్షగానే మారుతున్నది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇంకా వేలాది మంది మహిళలకు చీరలు అందనేలేదు. ఇక మున్సిపాలిటీల్లో అయితే పంపిణీకి ఎదురు చూపులు తప్పడంలేదు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం దసరా పండుగ సందర్భంగా బతుకమ్మ చీరలు పంపిణీ చేసింది. 18 ఏండ్లు నిండిన ప్రతి మహిళకు చీరలు అందించింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బతుకమ్మ చీరల పంపిణీని అటకెక్కించింది. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఈ సారి పంపిణీకి ముందుకొచ్చింది. బతుకమ్మ స్థానంలో ఇందిరమ్మ మహిళా శక్తి పేరుతో శ్రీకారం చుట్టింది. దసరాకు కాకుండా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి రోజున పంపిణీ ప్రారంభించారు. మహిళల ఆత్మగౌరవం పెంచడం, ఆర్థికంగా బలోపేతం చేయడం ఈ పథకం ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం ప్రకటించింది. ఆధార్, ఫేషియల్ రికగ్నిషన్ యాప్‌ను ఉపయోగించి పంపిణీ చేపట్టారు.
గతంలో చీరల పంపిణీ రేషన్ డీలర్లకు అప్పగించారు. కానీ ఈ సారి ప్రతి గ్రామానికి ప్రత్యేక అధికారిని నియమించారు. మహిళా సంఘాలతో సమన్వయం చేసుకుంటూ ఇబ్బందుల్లేకుండా పంపిణీ చేసే బాధ్యత ప్రత్యేక అధికారులను అప్పగించారు. అదే విధంగా గ్రామస్థాయి కమిటీలను మహిళా సంఘాలతో ఏర్పాటు చేశారు. డిసెంబర్ 9 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకున్నా క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లాకు 2.20 లక్షల చీరల కోసం అధికారులు ప్రతిపాదించారు. మొదట 1.75 లక్షల చీరలు రాగా, ఆ తర్వాత మరో 10 వేలు జిల్లాకు వచ్చాయి. మొత్తంగా ఇప్పటి వరకు జిల్లాకు 1.85 లక్షలు మాత్రమే వచ్చినట్లు లెక్కలు చెబుతున్నాయి. వీటిని ఆయా ప్రాంతాల్లోని గోదాముల నుంచి మండలాలకు తరలించారు. మండలాలకు చేరిన వాటిల్లోనూ ఇంకా 20 శాతం చీరలు పంచలేదు. అవి ప్రభుత్వ కార్యాలయాల్లోనే మూలుగుతున్నాయి. మొత్తంగా మరో 70 వేల చీరలు మహిళలకు పంపిణీ చేయాల్సి ఉంది. అధికారులు మాత్రం మధ్యలో ఎన్నికల కోడ్ రావడంతో పంపిణీ నిలిపేశామని చెబుతున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మొదట గ్రామా ల్లో ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక ఎన్నికలు జరగని మున్సిపాలిటీల్లో మాత్రం చీరలు అందలేదు. వీరికి రెండో విడత ఇస్తామని సర్కారే చెబుతోంది. జిల్లాలో ఆరు మున్సిపాలిటీలు ఉన్నాయి. భువనగిరి, యాదగిరిగుట్ట, ఆలేరు, మోత్కూరు, చౌటుప్పల్, భూదాన్‌పోచంపల్లిలో పురపాలికలు ఉన్నాయి. తొలి విడతలోని వారికే ఇంకా పూర్తి స్థాయిలో చీరలు అందలేదని, ఇక పట్టణ ప్రజలకు ఎప్పుడిస్తారో.. అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.