సూర్యాపేట టౌన్, ఆగస్టు 9 : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు ప్రజలకు ఉంటుందని.. అడ్డగోలుగా హామీలిచ్చి అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కారు పూర్తిగా విఫలమైందని మాజీమంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ఆయన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతూ భయబ్రాంతులకు గురిచేస్తే ప్రజల్లో తిరుగుబాటు మొదలవుతుందని హెచ్చరించారు.
ఆరు గ్యారెంటీల్లో అరకొర అమలు చేసి అసలు హామీలను అటకెక్కించారని విమర్శించారు. అధికారంలోకి వచ్చి పది నెలలు కావస్తున్నా పాలనలో అలసత్వం కనబడుతూనే ఉందన్నారు. అభివృద్ధికి చిరునామాగా ఉన్న కేసీఆర్ పాలనను ప్రజలు గుర్తుచేసుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వం, మంత్రులు, అధికారులు జరుగాల్సిన అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, మాజీ ఎంపీపీ, జడ్పీటీసీ నెమ్మాది భిక్షం, జీడి భిక్షం, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, కౌన్సిలర్లు తాహెర్ పాషా, బాషా, నాయకులు ఆకుల లవకుశ, బత్తుల జానీ యాదవ్, గుర్రం సత్యనారాయణరెడ్డి, జూలకంటి జీవన్‌రెడ్డి, తూడి నర్సింహారావు, కొణతం సత్యనారాయణరెడ్డి, సుధీర్ రావు, రౌతు నర్సింహారావు, రఫీ పాల్గొన్నారు.