తుంగతుర్తి, నవంబర్ 19 : కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎన్నికల్లో మహిళల ఓట్లు దండుకోవడానికే ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టిందని బీఆర్ఎస్ పార్టీ తుంగతుర్తి మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య ఆరోపించారు. బుధవారం మండలంలోని బండరామారంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో బతుకమ్మ పండుగకు ప్రతి మహిళకు చీర అందించి వారి కండ్లల్లో ఆనందాన్ని కల్పిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎన్నికల సందర్భంగా ఎలాంటి పండుగ లేకపోయినా మహిళల పట్ల కపట ప్రేమ చూపిస్తుందని దుయ్యబట్టారు.
కాంగ్రెస్ పార్టీ యెడల మహిళలు వ్యతిరేకత పెంచుకుని కోపంతో ఉన్నారని గ్రహించిన ప్రభుత్వం ఎలాగైనా సర్పంచ్ ఎన్నికల్లో చీరలు పంపిణీ చేసి మహిళల ఓట్లు దండుకుందామనే చూస్తుందన్నారు. కానీ మహిళలు నమ్మే పరిస్థితిలో లేరని స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మహిళలు తగిన బుద్ధి చెప్తారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పిటిసిలుగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.